శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌లకు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ దూరం కానున్నట్లు రెండు మూడు రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో రోహిత్ వేలికి గాయమైన సంగతి తెలిసిందే. ఇంకా గాయం నుంచి అతడు కోలుకోని కారణంగా ఇప్పుట్లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదని అంటున్నారు. అలాగే బాలీవుడ్ కథానాయిక అతియా శెట్టితో కేఎల్ రాహుల్ పెళ్లి చేసుకోనున్న నేపథ్యంలో అతనూ ఈ మ్యాచ్‌లకు దూరంగా ఉంటాడని చెబుతున్నారు. ఇప్పటికే ఓ బీసీసీఐ అధికారి ఈ విషయాన్ని చెప్పగా.. ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలంక చేకూరేలా.. ఇప్పుడదే విషయాన్ని మరో అధికారి కూడా అన్నారు. అయితే ఆయన మరో బాంబ్ కూడా పేల్చారు. కేవలం టీ20కే కాదట వన్డే సిరీస్‌కు కూడా ఇద్దరూ దూరమవుతారని చెప్పారు. దీంతో అభిమానులు హిట్ మ్యాన్ విషయంలో నిరాశ పడుతుండగా.. రాహుల్‌కు మాత్రం విషెస్ తెలుపుతున్నారు.
హార్దిక్ కెప్టెన్సీ.. : రోహిత్ దూరమయితే అతడి స్థానంలో టీ20 సిరీస్‌కు హార్దిక్ బాధ్యతలు తీసుకుంటాడని అంతా అంటున్నారు. మరి వన్డేకు ఎవరు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుంటోరో చూడాలి.
కోహ్లీకి విశ్రాంతి!.: ఇకపోతే, ఈ టీ20 సిరీస్‌కు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి నివ్వనున్నట్లు తెలిసింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ గ్యాప్ లేకుండా వరుసగా సిరీస్‌లు ఆడుతూ వస్తున్నాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లను దృష్టిలో పెట్టుకొని కోహ్లీకి విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వన్డేల్లో అతడు ఆడే అవకాశం ఉందని సమాచారం. కాగా, ఆతిథ్య భారత్, శ్రీలంక మూడు టీ20లు, మూడు వన్డేల్లో తలపడతాయి. జనవరి 3న తొలి టీ20 ప్రారంభమవుతుంది.
2022లో అంతగా ఆకట్టుకోలేకపోయారు..
2022లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక, రోహిత్ శర్మ తన 'హిట్ మ్యాన్' ట్యాగ్‌కు న్యాయం చేయలేకపోయాడు. ఈ ఏడాది రెండు టెస్టులు ఆడిన రోహిత్.. 30 సగటుతో 90 పరుగులు చేశాడు. 8 వన్డేల్లో మ్యాచ్‌ల్లో 41.50 సగటుతో 249 పరుగులు చేశాడు. అందులో అత్యధికంగా 76 పరుగుల ప్రదర్శనతో 3 అర్ధ శతకాలు చేశాడు. ఇక టీ20ల్లో 29 ఇన్నింగ్స్‌లు ఆడి.. 24.29 సగటుతో 656 పరుగులు చేశాడు. ఇందులో కూడా మూడు హాఫ్ సెంచరీలతో అత్యధికంగా 72 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ సంవత్సరం 40 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ.. 27.63 సగటుతో 995 పరుగులు చేశాడు. కాగా, 2012 నుంచి ఇప్పటివరకు ఒక్క సెంచరీ కూడా చేయకుండ ఉన్న ఏడాది ఇదే.
మరోవైపు కేఎల్ రాహుల్ ఈ ఏడాది నాలుగు టెస్టులు ఆడి.. 17.12 సగటుతో 137 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందులో అత్యధికంగా 50 పరుగులు చేశాడు. ఇక 10 వన్డే మ్యాచ్‌లు ఆడి 27.88 సగటుతో 251 పరుగులు చేశాడు. అత్యధికంగా 73 పరుగులు బాదాడు. టీ20ల్లో 16 మ్యాచ్‌లు ఆడి 28.93 సగటుతో 434 పరుగులు చేశాడు. అందులో ఆరు అర్ధ శతకాలతో 62 అత్యధిక స్కోర్ చేశాడు. ఈ సంవత్సరం మొత్తంగా 30 మ్యాచ్‌ల్లో 25.68 సగటుతో 822 పరుగులు చేశాడు.