ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణీ కొట్టింది. వరుసగా తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాలను అందుకున్న సన్‌రైజర్స్ మూడో మ్యాచుతో ఈ సీజన్లో ఖాతా తెరిచింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో.. రెండిటిలో అద్భుత ప్రదర్శన చేసి పంజాబ్ కింగ్స్‌ను మట్టికరిపించిది. సొంతగడ్డపై ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే (4/15) స్పిన్ మాయాజాలం, రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్; 48 బంతుల్లో 10×4, 3×6) ధానధన్ ఇన్నింగ్స్ వల్ల సన్‌రైజర్స్‌కు తొలి విజయం దక్కింది. శిఖర్ ధావన్ (99 నాటౌట్; 66 బంతుల్లో 12×4, 5×6) విరోచిత పోరాటం చేసినా వృథా అయింది.
మొదట టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లనష్టానికి 143 పరుగులు చేసింది. మార్కండేకు తోడు ఉమ్రాన్ మాలిక్ (2/32), మార్కో జాన్సెన్ (2/16) పంజాబ్‌ను బాగా కట్టిడి చేశారు. వరుసగా వికెట్లను పడగొట్టారు. దీంతో పంజాబ్ 90 స్కోరు కూడా చేయడం కష్టమనుకున్నారు. కానీ కెప్టెన్ శిఖర్ ధావన్(99*; 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) మాత్రం మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడుతూనే ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. కానీ ఒక్క పరుగు తేడాతో శతకం మిస్ చేసుకున్నాడు. సన్‌రైజర్స్ భువనేశ్వర్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు.
ఇక 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ బ్యాటర్లు.. బౌలర్లు ఇచ్చిన స్ఫూర్తితో.. గత మ్యాచ్‌లకు భిన్నంగా బ్యాటింగ్‌లో చెలరేగిపోయారు. ముఖ్యంగా రాహుల్ త్రిపాఠి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదట.. సన్‌రైజర్స్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు హ్యారీ బ్రూక్ (13; 14 బంతుల్లో 3×4) ప్రారంభంలోనే ఔట్ అయ్యాడు. అలా అతడు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఫెయిల్ అయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (21; 20 బంతుల్లో 3×4) కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. అప్పటికీ జట్టు స్కోరు 8.3 ఓవర్లలో 45/2. ఇక అప్పుడు త్రిపాఠి రంగంలోకి దిగి తన బ్యాటుకు పనిచెప్పాడు. మర్క్రమ్ (37*; 21 బంతుల్లో 6×4) నుంచి మంచి సహకారం లభించడం వల్ల త్రిపాఠి చెలరేగి ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో స్డేడియాన్ని హోరెత్తించాడు. చివరికి హర్‌ప్రీత్ బౌలింగ్‌లో బౌండరీ బాది త్రిపాఠి సన్‌రైజర్స్‌కు విజయం దక్కేలా చేశాడు. అలా త్రిపాఠి-మర్క్రమ్ కలిసి పంజాబ్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోకుండా చేశారు.
ఇవీ చదవండి :