పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్.. సోమవారం గుండెపోటుతో(Inzamam Heart Attack) ఆస్పత్రిలో చేరాడు. సోమవారం ఆయనకు ఛాతిలో నొప్పి రావడం వల్ల లాహోర్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. గత మూడు రోజులుగా ఛాతి నొప్పితో ఆయన బాధపడుతున్నారు. అయితే, సోమవారం నొప్పి తీవ్రమవడం వల్ల వైద్యులు గుండె పోటుగా నిర్ధారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
1991లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఇంజమామ్-ఉల్-హక్.. 1992లో జరిగిన వన్డే ప్రపంచకప్ విజేత పాకిస్థాన్ జట్టులో భాగమయ్యాడు. ఆ తర్వాతి కాలంలో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా ఎదిగాడు. తన కెరీర్‌లో 378 వన్డేలు ఆడిన ఇంజమామ్ 11,739(ఇందులో 10 సెంచరీలు ఉన్నాయి) పరుగులు చేశాడు. 120 టెస్టుల్లో 8830 రన్స్(25 సెంచరీలు) నమోదు చేశాడు. ఇక పాకిస్థాన్ ఆటగాళ్లలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇంజమామ్ గుర్తింపు పొందాడు.
ఇదీ చూడండి.. DC Vs KKR: కోల్‌కతా ప్లేఆఫ్స్ ఆశలను దిల్లీ ఆవిరి చేయనుందా?