Dhoni knee problem: కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలకు పెద్ద ఆస్పత్రులకు వెళ్లినా.. చికిత్స కోసం భారీగా ఖర్చు పెట్టినా పెద్దగా ఫలితం ఉండదు. అలాంటప్పుడు.. కొన్ని సందర్భాల్లో ఆయుర్వేదం సహా మిగితా రకాల వైద్యం తీసుకున్నప్పుడూ ఆ సమస్య మాయమైపోతుంది. ఇప్పుడు మహీకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. ప్రస్తుతం మహీ మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు తెలిసింది. దీంతో ట్రీట్మెంట్ కోసం అతడు ఓ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించినట్లు సమాచారం. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రూ.40లకే ఈ చికిత్స.. ఝార్ఖండ్ రాజధాని రాంచీకి సుమారు 70కిలోమీటర్ల దూరంలో ఉన్న లాపంగ్‌లో వైద్య భందన్ సింగ్ ఖర్వార్ అనే వైద్యుడు ఉన్నారు. ఆయనకు స్థానికంగా మంచి పేరు ఉంది. ఈ విషయం తెలుసుకున్న మహీ ఆయన దగ్గరకు వెళ్లి దశల వారిగా చికిత్స తీసుకుంటున్నాడట. వెళ్లిన ప్రతిసారి చికిత్స కోసం కేవలం 40 రూపాయలే చెల్లిస్తున్నాడట.
"ధోనీ ఓ సాధరమైన వ్యక్తిలా ఇక్కడికి వచ్చాడు. సెలబ్రిటీ అయినప్పటికీ అతడిలో ఎటువంటి గర్వం లేదు. నాలుగురోజులకు ఓ సారి వచ్చి చికిత్స తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి అభిమానులు ఇక్కడి వస్తున్నారు. దీంతో అతడు కారులోనే కూర్చుని మందు తీసుకుని వెళ్లిపోతున్నాడు. " అని డాక్టర్ భందన్ సింగ్ తెలిపారు. అలాగే ధోనీ తల్లిదండ్రులకు కూడా వైద్యం చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేసింది. సీజన్ ఆరంభంలో జడేజాను కెప్టెన్‌గా నియమించిన సీఎస్కే.. వరుస పరాజయాల నేపథ్యంలో మళ్లీ ధోనీకే సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. సీజన్ ముగిసేసరికి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
ఇదీ చూడండి: 'సారథిగా కంటే బౌలర్‌గానే జట్టుకు బుమ్రా అవసరం'