సమంత అక్కినేని.. పెళ్లికి ముందు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్లో దూసుకెళ్తోంది. నటిగా, వ్యాపారవేత్తగా జోరు మీదున్న సామ్.. సామాజిక మధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటుంది. అయితే ఇప్పుడు తన సోషల్‌మీడియా అకౌంట్లలో అక్కినేని పేరుతో పాటు తన పేరును తొలిగించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇందుకు గల కారణం తెలియరాలేదు. ప్రస్తుతం నెటిజన్లు దీని గురించే తెగ మాట్లాడుకుంటున్నారు.
2017లో హీరో నాగచైతన్యను పెళ్లి చేసుకున్న సమంత.. అనంతరం తన సోషల్‌మీడియా అకౌంట్లలో సమంత పక్కన 'అక్కినేని' పదాన్ని జోడించింది. దీనిపై ఆమెను చాలా మంది ప్రశంసించారు. కానీ ఇప్పుడు అకస్మాతుగా ట్విట్టర్, ఇన్‌స్టా నుంచి అక్కినేని పదాన్ని తొలిగించి ఎస్ అక్షరం పెట్టుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 'సామ్ ఎందుకిలా చేసింది?' అంటూ మాట్లాడుకుంటున్నారు.
ఇటీవల 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్. ఈ సిరీస్‌లో రాజీ పాత్ర పోషించి.. తనదైన శైలి నటనతో ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం'లో నటిస్తోంది.
ఇదీ చూడండి: The Family Man 2: సమంత క్షమాపణలు చెప్పాలి