ఆరోగ్యమో, పర్యావరణమో, సామాజికమో.. సమస్యలేవైనా మనిషిని తీవ్రంగానే ప్రభావితం చేస్తాయి. వీటిని పరిష్కరించటంలో సాంకేతిక పరిజ్ఞానం తోడు ఎంతైనా అవసరం. ఆవిష్కరణ ఎంత మంచిదైనా అది ప్రజలకు అందుబాటులోకి వస్తేనే సార్థకత. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌కు చెందిన అప్‌లింక్ వేదిక అటు ఆవిష్కర్తలను.. ఇటు నిపుణులు, పెట్టుబడిదారులను అనుసంధానం చేస్తోంది. వినూత్న ఆవిష్కరణలు అందుబాటులోకి రావటానికి బాటలు వేస్తోంది. వీటిల్లో కొన్ని ఇవీ..
నిరాశ్రయ పిల్లల తోడు
హెల్పింగ్ హ్యాండ్. ఇదో డిజిటల్ గేమ్. అవటానికిది ఆటే గానీ గాయాల పాలైన పిల్లలు కోలుకోవటానికి తోడ్పడుతుంది. గత సంవత్సరం అప్‌లింక్ మెంటల్ హెల్త్ ఛాలెంజ్‌లో విజేతగా నిలిచిన దీన్ని నార్వేకు చెందిన అటెన్సీ అనే డిజిటల్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఒక సైకాలజిస్ట్ భాగస్వామ్యంతో రూపొందించింది. వ్యాపార సంస్థలు తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వటానికి తయారుచేసే గేమ్స్ మాదిరిగానే ఇది ఉంటుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలను కంప్యూటర్ గేమ్‌లో సృష్టించి, వాటిని ఎదుర్కోవటాన్ని నేర్పించటం ఇందులో కీలకాంశం. దీంతో సానుకూల నిర్ణయాలు తీసుకోవటం, మనోధైర్యం పెంపొందుతాయి. ఆత్మహత్య ఆలోచనలు, ఆందోళన, కుంగుబాటు నుంచి బయటపడేలా చేస్తుంది. ఇప్పటికే ఇది సిరియా పౌర యుద్ధంలో నిరాశ్రయులైన 2వేల మంది చిన్నారులకు విజయవంతంగా చేయూత నిచ్చింది. ఈ ఆట ఆడటానికి ముందు 28% మంది మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఆరోగ్యంగా ఉండగా.. 10 వారాల తర్వాత 99% మంది మామూలు ఆరోగ్యంతో ఉన్నట్టు తేలటం గమనార్హం. హెల్పింగ్ హ్యాండ్ ఇటీవల ఉక్రెయిన్ యుద్ధ బాధిత పిల్లలకూ చేదోడుగా నిలిచింది.
డ్రోన్లతో చెట్ల విస్తరణ
భూతాపాన్ని నిలువరించే ఉత్తమమైన యంత్రాంగాలను మనం చాలా వేగంగా కోల్పోతున్నాం. మానవ నాగరికత విలసిల్లటానికి ముందు భూమ్మీద 6 ట్రిలియన్ల చెట్లు ఉండేవని అంచనా. ఇప్పుడివి 3 ట్రిలియన్లకు పడిపోయాయి. ఏటా 2వేల కోట్ల చెట్లను కోల్పోతున్నాం. ఇప్పటికీ విత్తనాలను చేతులు, పలుగు వంటి వాటితోనే నాటుతున్నాం. ఇది శ్రమతో కూడుకున్నది. ఎక్కువ సమయమూ పడుతుంది. ఎక్కడైనా అడవులు కాలిపోతే తర్వాత అక్కడికి చేరుకోటమూ కష్టమే. అతి ప్రమాదకరం కూడా.
ఈ నేపథ్యంలో కెనడాకు చెందిన ఫ్లాష్ ఫారెస్ట్ సంస్థ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. కార్చిచ్చులతో కాలిపోయిన అటవీ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా విత్తనాలను చల్లటం ఆరంభించింది. కేవలం విత్తనాలనే కాదు.. అవి మొలకెత్తటానికి అవసరమైన పోషకాలను జతచేసి మరీ చల్లటం విశేషం. ఎందుకంటే విత్తనాలు చల్లినా అవి మొలకెత్తుతాయో లేదో తెలియదు. ఈ ఇబ్బందిని తప్పించేందుకే ఈ సరికొత్త ప్రయత్నం.
వ్యర్థజలాలతో విద్యుత్తు
వ్యర్థజలాలు పెద్ద సమస్య. ఇందులో 80% శుద్ధి కాకుండానే జల వనరుల్లో కలుస్తోంది! దీన్ని శుద్ధి చేయటమే కాదు, విద్యుత్తునూ సృష్టిస్తే? అమెరికా కంపెనీ అక్వాసైకిల్స్‌కు చెందిన బయోఎలక్ట్రోకెమికల్ ట్రీట్‌మెంట్ టెక్నాలజీ (బీఈటీటీ) ఇలాగే ఆలోచించింది. సహజ బ్యాక్టీరియాతో వ్యర్థజలాలను శుద్ధిచేసి, దీంతో విద్యుత్తును ఉత్పత్తి చేసి పారిశ్రామిక అవసరాలకు పంపిణీ చేయటం దీని ఉద్దేశం. ఇది ఉపయోగించే పరిజ్ఞానం వినూత్నమైంది. వ్యర్థజలాలను పలుచగా చేయాల్సిన అవసరం లేకుండానే, చాలా వేగంగా శుద్ధి చేసేస్తుంది. తక్కువ ఇంధనంతోనే ఎక్కువ పనిచేస్తుంది.
జీవజాతుల మూకుమ్మడి అన్వేషణ
ప్రకృతిలో జీవజాతుల అంతర్ధానం వేగంగా కొనసాగుతోంది. సాధారణంగా ఆయా జీవజాతులను గుర్తించటానికి బైనాక్యులర్లు, కెమెరాలు, మైక్రోస్కోప్‌లు, నీటికి తడవని నోట్‌బుక్కుల వంటివి వాడుతుంటారు. వీటి సాయంతో జీవుల వివరాలను నమోదు చేస్తుంటారు. అయితే మనం గుర్తించే సరికే కొన్ని జీవులు కనుమరుగు అవుతున్నాయి. ఈ ఉపద్రవాన్ని దృష్టిలో పెట్టుకొనే బ్రిటన్‌కు చెందిన నేచర్‌మెట్రిక్స్ సంస్థ వినూత్న మార్గంలో ప్రయత్నం చేస్తోంది. డీఎన్‌ఏ క్రమం సాయంతో ఒకేసారి వేలాది జీవులను గుర్తించటం దీని ప్రత్యేకత. నీటిలో, నేలలో, గాలిలో జీవులు తమ డీఎన్‌ఏ జాడలను వదులుతుంటాయి. వీటి ఆధారంగానే జీవుల ఉనికిని పట్టుకుంటారు. లీటరు నది నీటిని వడపోయటం ద్వారానే జీవుల జాడను గుర్తిస్తుండటం విశేషం. సంప్రదాయ పద్ధతుల్లో సర్వే చేసి, గుర్తించాలంటే ఇందుకు కనీసం పదేళ్లు పడుతుంది.
కార్చిచ్చులకు పరిష్కారం
అడవులు పచ్చగా ఉంటేనే కదా మానవ మనుగడ సాధ్యమయ్యేది. కానీ కార్చిచ్చులు వీటికి పెద్ద ముప్పును తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా అమెజాన్ అడవిలో చెలరేగే మంటలు పెను ముప్పును తెచ్చిపెడుతున్నాయి. బ్రెజిల్ నుంచి వెలువడే కర్బన ఉద్గారాల్లో సగానికి పైగా ఉద్గారాలకు ఇవే కారణమవుతున్నాయి. గత సంవత్సరం ఆగస్టులో ఒక్క రోజులోనే బ్రెజిల్ సమీప అమెజాన్ అడవిలో 3,358 కార్చిచ్చులు చెలరేగాయి. పర్యావరణ అంశాలను పరిశీలించే గ్రీన్‌పీస్ సంస్థ ప్రకారం 2007 తర్వాత 24 గంటల్లో ఇంత పెద్ద సంఖ్యలో కార్చిచ్చులు తలెత్తటం ఇదే తొలిసారి. వీటి విస్తరణను ఆపటానికి ఉమ్‌గ్రామియో సంస్థ కృత్రిమ మేధ సాయంతో ప్రయత్నిస్తోంది. ఉపగ్రహ చిత్రాలను ఏఐ ఆల్గోరిథమ్‌లతో మేళవించి కార్చిచ్చులు తలెత్తే అవకాశమున్న ప్రాంతాలను, పొగలను సెకండ్లలోనే గుర్తించి, ఆయా కంపెనీలకు హెచ్చరికలు పంపిస్తుంది. ఇది మంచి ఫలితాలు ఇస్తోంది.
చెత్త నిర్మూలన కొత్తగా
అమ్మ చెత్త అంటే ఏంటి?’ కుమార్తె అడిగిన ఈ ప్రశ్నతోనే మనదేశ పారిశ్రామిక వేత్త నివేదా బెంగళూరులో ట్రాష్‌కాన్ సంస్థను ఆరంభించారు. ఈ సంస్థ తడి చెత్త నుంచి పొడి పదార్థాలను వేరు చేసే వ్యవస్థను రూపొందించింది. ఇది రోజుకు 200 టన్నుల వ్యర్థాలను చేయగలదు. మిగిలిన తడి చెత్తను కంపోస్టు ఎరువుగా, బయోగ్యాస్‌గా మారుస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ప్లైవుడ్ వంటి షీట్స్ రూపంలోకి మార్చే విధానాన్నీ ట్రాష్‌కాన్ తయారుచేసింది. దీన్ని ఫర్నిచర్, భవన నిర్మాణ సామగ్రికి ఉపయోగించుకోవచ్చు. ఈ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో 16 ఆటోమేటిక్ సార్టింగ్ కేంద్రాలను ఆరంభించింది. త్వరలో బెంగళూరులో 500 టన్నుల వ్యర్థాలను ప్రాసెస్ చేసే కేంద్రాన్ని నెలకొల్పాలనీ చూస్తోంది. 2025 కల్లా ఏటా 2.5 కోట్ల టన్నుల చెత్తను శుద్ధి చేయాలన్నది నివేదా సంకల్పం. ఆమె చూపుతున్న చెత్త సమస్య పరిష్కారాన్ని నొక్కి చెప్పటానికి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఇటీవల దావోస్‌లో జరిగిన వార్షిక సమావేశానికీ నివేదాను ఆహ్వానించటం విశేషం.