వాట్సాప్‌లో వీడియోకాల్ మాట్లాడుతునప్పుడు లేదా చాట్ చేస్తున్నప్పుడు నెట్‌వర్క్ సరిగా లేకుంటే సంభాషణ మధ్యలో ఆగిపోతుంది. దీనివల్ల ముఖ్యమైన విషయాన్ని ఇతరులతో షేర్ చేయడం సాధ్యంకాదు. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ ప్రాక్సీ సపోర్ట్ పేరుతో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో యూజర్లు ఇంటర్నెట్ లేకున్నా కాల్స్ మాట్లాడుకోవడంతోపాటు, చాట్ సంభాషణలు కొనసాగించవచ్చు.
ఎలా పనిచేస్తుంది?
యూజర్ ఉంటున్న ప్రాంతంలో నెట్‌వర్క్ సమస్య కారణంగా వాట్సాప్ పనిచేయకపోతే.. ప్రాక్సీ సాయంతో ప్రపంచవ్యాప్తంగా కొన్ని సంస్థలు, వాలంటీర్లు ఏర్పాటు చేసిన సర్వర్ల ద్వారా వాట్సాప్‌కు కనెక్ట్ కావచ్చు. దీంతో యూజర్లు నేరుగా వాట్సాప్ సర్వర్‌కు కనెక్ట్ అవుతారు. తర్వాత ఎలాంటి అంతరాయం లేకుండా కాల్స్, మెసేజ్‌లు చేయొచ్చు. ప్రాక్సీ ద్వారా జరిపే సంభాషణలు పూర్తిగా సురక్షితమని, వాటికి కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని వాట్సాప్ చెబుతోంది.
"2023లో యూజర్లకు అడ్వాన్స్‌డ్ ఫీచర్లను పరిచయం చేయాలని భావిస్తున్నాం. ఇంటర్నెట్ లేదా నెట్‌వర్క్ సమస్య కారణంగా గతేడాది చాలా ప్రాంతాల్లో యూజర్లు వాట్సాప్ సేవలను సరైన సమయంలో పొందలేకపోయారు. దీనివల్ల అవసరంలో ఉన్నవారికి సహాయం అందించలేని పరిస్థితి. ప్రాక్సీ ద్వారా ఇంటర్నెట్ లేకున్నా.. సమాచార మార్పిడిని కొనసాగించవచ్చు" అని వాట్సాప్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఫీచర్ కోసం వాట్సాప్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ అండ్ డేటాలోకి వెళితే ప్రాక్సీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో యూజ్ ప్రాక్సీ అనే ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తే ప్రాక్సీ సేవలు అందుబాటులోకి వస్తాయి. అయితే, యూజర్లు వాట్సాప్‌కు కనెక్ట్ కాలేని సందర్భంలో మాత్రమే ఈ ఫీచర్ పనిచేస్తుందని వాట్సాప్ చెబుతోంది.
డిస్‌అప్పియరింగ్ మెసేజ్‌లు డిలీట్ కాకుండా..
ఇదేకాకుండా వాట్సాప్ కెప్ట్ మెసేజెస్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. దీంతో డిస్‌అప్పియరింగ్ మెసేజ్‌లను కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇందుకోసం యూజర్లు మెసేజ్ పంపే ముందు, టైమ్ లిమిట్ తర్వాత మెసేజ్‌లు ఉంచాలా?, వద్దా? అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఒకవేళ ఉంచాలని యూజర్ నిర్ణయిస్తే డిస్‌అప్పియరింగ్ మెసేజ్‌లో బుక్‌మార్క్ ఆప్షన్ ఉంటుంది. దానిని సెలెక్ట్ చేస్తే డిస్‌అప్పియరింగ్ మెసేజెస్‌లు టైమ్ లిమిట్ తర్వాత కూడా విండో నుంచి డిలీట్ కావు. ఇందుకోసం ప్రైవసీ సెట్టింగ్స్‌లో వాట్సాప్ మార్పులు చేయనుంది. దీనిపై మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.