ఆండ్రాయిడ్,క్రోమ్ యూజర్ల ఆన్‌లైన్ భద్రత విషయంలో గూగుల్ మరో కీలక నిర్ణయ తీసుకుంది. ఇందులో భాగంగా పాస్‌కీ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో యూజర్లు అదనపు సెక్యూరిటీ పొందుతారని గూగుల్ తెలిపింది. ప్రస్తుతం యూజర్లు ఆన్‌లైన్ ఖాతా లాగిన్ కోసం పాస్‌వర్డ్, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉపయోగిస్తున్నారు. గూగుల్ త్వరలో పరిచయం చేయబోయే పాస్‌కీ ఫీచర్‌తో ఖాతా లాగిన్ కోసం పిన్ లేదా బయోమెట్రిక్‌తో ధ్రువీకరించాలి.
ప్రస్తుతం ఉన్న టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంటే ఈ ఆప్షన్ మరింత మెరుగైన భద్రతను అందిస్తుందని గూగుల్ భావిస్తోంది. ముందుగా యూజర్లు తమ ఆండ్రాయిడ్ డివైజ్‌లలో లాగిన్ కావాలనుకుంటున్న ఖాతాను సెలెక్ట్ చేయాలి. తర్వాత రిజిస్టర్ చేసిన ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ అన్‌లాక్‌తో లాగిన్ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు. పాస్‌కీ ధ్రువీకరణ కోసం యూజర్ రిజిస్టర్ చేసిన ఫింగర్ ప్రింట్, ఫేస్‌అన్‌లాక్, క్యూఆర్ కోడ్ వివరాలు గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్‌లో సేవ్ అవుతాయి. భవిష్యత్తులో యూజర్ కొత్త ఫోన్ లేదా డివైజ్‌లోకి మారినప్పుడు సులువుగా డేటా బదిలీ, ఖాతా లాగిన్ చేయొచ్చని గూగుల్ చెబుతోంది.
ఏంటీ పాస్ కీ?
పాస్ కీ అనేది క్రిప్టోగ్రాఫిక్ ప్రైవేట్ కీ. చాలా సందర్భాల్లో ఈ ప్రైవేట్ కీ యూజర్ ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలో నిక్షిప్తం అయివుంటుంది. పాస్ కీ క్రియేట్ అయిన తర్వాత దానికి సంబంధించిన పబ్లిక్ కీ ఆన్‌లైన్‌లో స్టోర్ అవుతుంది. యూజర్ తన ఖాతాలోకి లాగిన్ చేసేప్పుడు ప్రైవేట్ కీకి సంబంధించిన వివరాలను పబ్లిక్ కీ వెరిఫై చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం యూజర్ డివైజ్ నుంచే జరుగుతుంది. దీనికోసం యూజర్ తప్పనిసరిగా తన డివైజ్‌ను కూడా అన్‌లాక్ చేయాలి. ప్రాసెస్ మొత్తం పూర్తయ్యాక యూజర్‌కు ఖాతా యాక్సెస్ లభిస్తుంది.
ఆన్‌లైన్ ఖాతాలకు పాస్‌వర్డ్‌లెస్ సైన్-ఇన్ పద్ధతిని తీసుకురానున్నట్లు ఈ ఏడాది ప్రథమార్ధంలోనే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు ప్రకటించాయి. ఇందుకోసం మూడు దిగ్గజ కంపెనీలు కలిసి పనిచేస్తామని తెలిపాయి. ఈ నేపథ్యంలో గూగుల్ పాస్ కీ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ప్రస్తుతం డెవలపర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలోనే సాధారణ యూజర్లకు పరిచయం చేయనున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే మెసేజ్ ఎడిట్ ఫీచర్!