స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో వాటికి అనుసంధానంగా స్మార్ట్ వేరుబుల్స్‌కి మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. గతేడాది సెప్టెంబరులో స్మార్ట్‌గ్లాసెస్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్, కళ్లజోళ్ల తయారీ కంపెనీ రేబాన్ సంయుక్తంగా ప్రకటించాయి. తాజాగా ఫేస్‌బుక్, రేబాన్ సరికొత్త స్మార్ట్‌గ్లాసెస్‌ను మార్కెట్లోకి విడుదల చేశాయి. 'రేబాన్ స్టోరీస్' (RayBan Stories) పేరుతో మూడు డిజైన్లలో వేర్వేరు రంగుల ఫ్రేమ్స్‌తో ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ను తీసుకొచ్చాయి. మరి రేబాన్ స్టోరీస్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ధరెంత.. ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయనేది తెలుసుకుందాం.
ఫేస్‌బుక్ రేబాన్ స్టోరీస్
ఈ స్మార్ట్‌గ్లాసెస్ రేబాన్ వేఫరర్ మోడల్ తరహాలో ఉంటాయి. ఇందులో ఫ్రేమ్‌కి రెండువైపులా 5 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ఇవి 2,592x1,944 పిక్సెల్ రిజల్యూషన్‌తో ఫొటోలను, 1,184x1,184 పిక్సెల్ రిజల్యూషన్‌తో 30 సెకన్ల నిడివి కలిగిన వీడియోలను రికార్డు చేస్తుంది. సుమారు 500 ఫొటోలను, 30 సెకన్ల నిడివి ఉన్న 35 వీడియోలను ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అలానే కెమెరాతోపాటు రెండువైపులా ఎల్‌ఈడీ లైట్లు ఇస్తున్నారు. స్మార్ట్‌గ్లాసెస్‌తో ఫొటో తీసేప్పుడు అవి ఫొటో తీస్తున్నట్లు ఎదుటివారికి తెలియజేస్తాయి. ఫ్రేమ్ కుడివైపు పైభాగంలో ఫొటో, వీడియోను తీసేందుకు బటన్ ఉంది. ఇది స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను మాత్రం ఫేస్‌బుక్ వెల్లడించలేదు.
ఫీచర్లు ఇవే..
రేబాన్ స్టోరీస్‌లో ఫ్రేమ్‌కి రెండు వైపులా ఓపెన్-ఇయర్ స్పీకర్స్ ఉన్నాయి. వీటి ద్వారా మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. అలానే ఫ్రేమ్ కుడివైపు టచ్ కంట్రోల్స్ ఉన్నాయి. వాటిపై ఒక్కసారి టచ్ చేస్తే మ్యూజిక్ ప్లేబ్యాక్, రెండుసార్లు టచ్ చేయడం ద్వారా సౌండ్ పెరగటం, తగ్గించుకోవడం, మూడుసార్లు టచ్ చేస్తే కాల్స్ మాట్లాడొచ్చు. ఫోన్ కాల్స్ కోసం ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లో మూడు మైక్రోఫోన్స్ ఇస్తున్నారు. బ్లూటూత్ సాయంతో యూజర్స్ తమ రేబాన్ స్టోరీస్‌ని స్మార్ట్‌ఫోన్‌తో అనుసంధానించుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 8.0, ఐఓఎస్ 13 ఆపై ఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. ఫేస్‌బుక్ వ్యూ యాప్ ద్వారా యూజర్స్ స్మార్ట్‌గ్లాసెస్‌తో తీసిన ఫొటోలు, వీడియోలను చూడొచ్చు. వీటిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్, మెసేంజర్ వంటి సామాజిక మాధ్యమాల్లో సులువుగా పోస్ట్ చేయొచ్చు. ఫేస్‌బుక్ వాయిస్ అసిస్టెంట్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది యూజర్ నుంచి వచ్చే కమాండ్‌లను అనుసరిస్తూ అందుకనుగుణంగా యూజర్స్‌కి సేవలందిస్తుంది. ఒకవేళ యూజర్ ఫేస్‌బుక్ అసిస్టెంట్ సేవలు వద్దనుకుంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి వాటని డిసేబుల్ చేసుకోవచ్చు.
ధర ఇలా...
ఈ స్మార్ట్‌గ్లాసెస్‌ను ఛార్జ్ చేసేందుకు ప్రత్యేకమైన ఛార్జింగ్ కేస్ ఇస్తున్నారు. యూఎస్‌బీ టైప్-సీ ఛార్జింగ్ కేబుల్‌తో ఇది ఛార్జ్ అవుతుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 ఫొటోలు, 30 సెకన్ల నిడివి ఉన్న 30 వీడియోలను తీసుకోవచ్చు. ఆరు రకాల లెన్స్ వేరియంట్లలో రేబాన్ స్టోరీస్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో రెగ్యులర్, పోలరైజ్‌డ్, ట్రాన్సిషన్ లెన్స్‌లు ఉన్నాయి. వీటి ధర 299 డాలర్ల నుంచి 379 డాలర్లుగా ఫేస్‌బుక్ నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 22,000 నుంచి రూ. 28,000 మధ్య ఉంటుందని అంచనా. బ్లాక్, బ్లూ, బ్రౌన్, గ్రీన్ రంగుల్లో లభిస్తాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ, బ్రిటన్, అమెరికా మార్కెట్లలో మాత్రమే అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. త్వరలోనే భారత మార్కెట్లో వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: iphone 13: ఐఫోన్-13 ఫీచర్స్ లీక్.. మాములుగా లేవుగా!