ETV Bharat / opinion

కన్నడ పీఠంపై బొమ్మై.. ముగిసిన యడ్డీ రాజకీయ ప్రస్థానం! - బసవరాజ్​ బొమ్మై

దక్షిణాదిలో కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించిన యడియూరప్ప ప్రస్థానం దాదాపుగా ముగిసిపోయింది. నాలుగు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మొత్తంగా అయిదేళ్ల పాటు అధికారాన్ని చలాయించినా- 78 ఏళ్ల వయసులో అయిష్టంగానే కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. లింగాయత్‌ వర్గానికే చెందిన యడ్డీ విధేయుడు బొమ్మై సారథ్యంలో 2023 ఎన్నికల్లో భాజపా మళ్ళీ విజయకేతనం ఎగురవేస్తుందా?

karnataka politics, బసవరాజ్​ బొమ్మై
కన్నడ పీఠంపై బొమ్మై.. ముగిసిన యడ్డీ రాజకీయ ప్రస్థానం!
author img

By

Published : Jul 28, 2021, 7:27 AM IST

కర్ణాటక కమల దళపతి యడియూరప్ప అనివార్య పరిస్థితుల్లో అస్త్రసన్యాసం చేశారు. అధిష్ఠానం ఆశీస్సులతో కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్‌ బొమ్మై నుదుట కస్తూరి తిలకం దిద్దుకున్నారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదని పది రోజుల క్రితం చిద్విలాసంగా చెప్పిన యడ్డీ- మొన్న సోమవారం నాడు కన్నీటి పర్యంతమవుతూ పదవీ పరిత్యాగ ప్రకటన చేశారు. ఇరవై నాలుగు గంటల్లోనే బెంగళూరులో సమావేశమైన భాజపా శాసనసభ్యులు తమ నూతన నేతను ఎన్నుకున్నారు. అక్కడితో కన్నడ రాజకీయాల్లో ఒక శకం పరిసమాప్తమైంది! 'భారతీయ' జనతా పార్టీ పేరుకు సార్థకత చేకూరేలా దక్షిణాదిలో కాషాయ ధ్వజాన్ని రెపరెపలాడించిన నాయకుడి ప్రస్థానం దాదాపుగా ముగిసిపోయింది. 'రాజా హులి'(రాజా పులి)గా పూలు చల్లించుకున్న చోటే 'జైల్యూరప్ప'గా రాళ్లదెబ్బలూ చవిచూసిన బూకనకెరె సిద్ధలింగప్ప యడియూరప్ప- 'సంఘ్‌' ప్రచారక్‌గా జీవనయానం ప్రారంభించారు.

గుమాస్తాగా పనిచేస్తూనే భాజపా కోసం పరిశ్రమిస్తూ ప్రజాజీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1985 ఎన్నికల్లో రెండంటే రెండు శాసనసభా స్థానాలు గెలిచిన పార్టీని రెండు దశాబ్దాల్లో అధికార పక్షంగా అవతరింపజేశారు. రాష్ట్ర జనాభాలో 15శాతానికి పైబడిన వీరశైవ లింగాయతుల దన్నుతో కన్నడనాట భాజపాను బలమైన శక్తిగా తీర్చిదిద్దారు. నాలుగు సార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసి మొత్తంగా అయిదేళ్ల పాటు అధికారాన్ని చలాయించినా- 78 ఏళ్ల వయసులో అయిష్టంగానే కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది.

అధిష్ఠానం ఓటు దానికే..

యడ్డీ చిన్న కుమారుడు విజయేంద్ర 'సూపర్‌ సీఎం'గా చెలరేగిపోతున్నాడని స్వపక్షీయులే కొన్నాళ్లుగా కారాలు మిరియాలు నూరుతున్నారు. శాసనసభ్యుల అసమ్మతికి, కొత్త నీటికి తోవ చేయాలన్న పార్టీపెద్దల వ్యూహం తోడై- రాజకీయ కురువృద్ధుడి నిష్క్రమణపర్వానికి రంగం సిద్ధమైంది. యడ్డీని కొనసాగించాలన్న లింగాయత్‌ మఠాధిపతుల విజ్ఞప్తిని తోసిపుచ్చి మరీ ముఖ్యమంత్రి మార్పునకే అధిష్ఠానం ఓటేసింది. 'యడియూరప్ప కన్నీళ్లలో భాజపా కొట్టుకుపోతుంది' అంటున్న హుబ్బళ్ళి మఠాధిపతి మాట నిజమవుతుందా? లింగాయత్‌ వర్గానికే చెందిన యడ్డీ విధేయుడు బొమ్మై సారథ్యంలో 2023 ఎన్నికల్లో భాజపా మళ్ళీ విజయకేతనం ఎగురవేస్తుందా?

కర్ణాటక పూర్వ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై తనయుడైన బసవరాజ్‌- ఒకటిన్నర దశాబ్దాల కిందట జనతాదళ్‌ నుంచి భాజపాకు వలసవచ్చారు. ఇటీవలి దాకా హోంశాఖ మంత్రిగా ఉన్న ఆయనకు సామాజిక నేపథ్యమే నిచ్చెనమెట్టుగా అక్కరకొచ్చింది. లింగాయతులపై గట్టి పట్టున్న ప్రజాకర్షక నేత యడ్డీ స్థానాన్ని మరో వర్గం నాయకుడితో భర్తీ చేస్తారనే వార్తలు తొలుత వ్యాపించినా- భాజపా పెద్దలు అంతటి సాహసానికి ఒడిగట్టలేదు. లింగాయత్‌ ఓటుబ్యాంకును దూరం చేసుకుంటే అసలుకే మోసమొస్తుందన్న ముందుజాగ్రత్తతోనే ఇప్పుడు బొమ్మైకి పట్టంకట్టారు. 'ఆపరేషన్‌ కమలం'తో అధికారాన్ని అందిపుచ్చుకొన్న దరిమిలా యడ్డీని గద్దె దింపేందుకు అస్మదీయులే బోలెడన్ని అక్రమాల చిట్టాపద్దులను వల్లెవేశారు.

తప్పులన్నీ తండ్రీకొడుకులకు అంటగట్టి పార్టీని పులుకడిగిన ముత్యంగా అభివర్ణిస్తున్నారు. దీనిపై ప్రతిపక్ష శిబిర దాడిని సమర్థంగా ఎదుర్కొంటూనే, పార్టీలోని అసంతృప్తులను బుజ్జగిస్తూ యడియూరప్ప అభిమానులను తన వైపు తిప్పుకోవడం బొమ్మైకి కత్తిమీదసామే! భాజపా అధిష్ఠానం ఆలోచనలకు అనుగుణంగా అటల్‌-ఆడ్వాణీ తరంలోని నేతలందరూ ఒక్కొక్కరుగా తెరమరుగు అవుతున్నారు. రాష్ట్రాల్లో ఒంటిచేత్తో అధికారాన్ని సాధించిపెట్టగలిగిన బలమైన నేతలూ పోనుపోను కరవవుతున్నారు. ఈ వరసలో తరవాతి పేరు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌దేనన్న విశ్లేషణలు గుప్పుమంటున్నాయి. మోదీ వ్యక్తిగత జనాకర్షక శక్తి, అమిత్‌ షా తెరచాటు మంత్రాంగాలతో అప్రతిహత విజయాలను నమోదు చేస్తూ వచ్చిన భాజపాకు పశ్చిమ్‌ బంగలో ఇటీవల ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ పునాదులు బలంగా ఉన్న రాష్ట్రాల్లో తలపెట్టిన రాజకీయ ప్రయోగాలు కమలదళాన్ని ఏ తీరానికి చేరుస్తాయో కాలమే చెప్పాలి!

ఇదీ చదవండి : 45 ఏళ్ల తర్వాత బతికొచ్చిన వ్యక్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.