పరిస్థితులే మన మనస్తత్వాలను తీర్చిదిద్దుతాయి. భూగోళంపై ఉన్న వనరులు పరిమితం, మన అవసరాలేమో అపరిమితం. మానవులకు మొదటి నుంచీ అన్నీ కొరతే. అందువల్లనే మనం మనగలగాలంటే పరిమిత వనరులను ఇతరులకు దక్కనివ్వకుండా మనమే చేజిక్కించుకోవాలనే భావన పాతుకుపోయింది. సిద్ధాంతాలు, భావజాలాల మధ్య, వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య విభేదాలకు ఈ భావనే మూల కారణం. అదే సంఘర్షణలు, యుద్ధాలకు దారితీస్తోంది. ఇతరులు ఏమైపోయినా సరే మనం మాత్రం బాగుండాలి, అందరూ ఓడిపోవాలి, మనమే గెలవాలి అనే ధోరణి పూర్వకాలం నుంచి ఆధునిక కాలం వరకు కొనసాగడం దురదృష్టకరం. ఈ ధోరణి వల్లనే దేశాలు వనరుల కోసం, భూభాగాల కోసం కలహించుకొంటాయి. ప్రపంచంలో ఒకవైపు పేదలు ఆకలితో అలమటిస్తుంటే- మరోవైపు ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసరాలకు కొరత సృష్టించడం చూస్తూనే ఉన్నాం. నిత్యావసరాలనూ ఒక ఆయుధంగా మారుస్తున్నారన్నమాట.
వందల కోట్లమంది టీకాలు లేక ప్రాణభయంతో వణికిపోతున్నా కొద్దిమంది మాత్రం టీకాలను నిల్వ చేసుకోవడం ఇటీవల పరికించాం. దురాశ, సంఘర్షణ అనేవి మానవుడి సహజ లక్షణాలని, అవి అతడి ప్రవృత్తిలోనే ఉన్నాయని వాదించే వాళ్లున్నారు. ఈ వాదనతో నేను ఏకీభవించను. మానవులు స్వతస్సిద్ధంగా స్వార్థపరులైతే... త్యాగ నిరతిని, పరోపకార పరాయణత్వాన్ని బోధించే అనేకానేక ఆధ్యాత్మిక సంప్రదాయాలను తలకెత్తుకోరు కదా! భిన్నత్వంలో ఏకత్వం ఉందని, మనుషులంతా ఒక్కటేనని అనాది నుంచి సర్వమతాలు ప్రవచిస్తూనే ఉన్నాయి. భారతీయులు ప్రాచీన కాలం నుంచి సకల చరాచర సృష్టి పంచభూతాల కలయికతో జరిగిందని విశ్వసిస్తున్నారు. నేల, నీరు, నిప్పు, వాయువు, ఆకాశ తత్వాల సమ్మేళనం నుంచి చేతనాచేతన జగత్తు ఉద్భవించిందని నమ్ముతున్నారు. మనలోని పంచతత్వాలు లేదా పంచభూతాల మధ్య సామరస్యం ఉంటేనే శారీరక, మానసిక పటిష్ఠత, సామాజిక, పర్యావరణ శ్రేయస్సు సమకూరతాయి.
అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం
జీ20 అధ్యక్ష హోదాలో భారతదేశం వసుధైవ కుటుంబకం సూత్రానికి కట్టుబడి కార్యాచరణ సాగిస్తుంది. ఇటీవల ప్రపంచమంతటా మారిపోయిన పరిస్థితులను గ్రహించి తగు దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో మనం సమష్టిగా విఫలమయ్యాం. భవిష్యత్తులో ఇలాంటి వైఫల్యాలను నివారించడానికి 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత' అనే నినాదాన్ని జీ20 అధ్యక్ష హోదాలో భారత్ చేపడుతోంది. ఇటీవలి కాలంలో మానవుల పరిస్థితిలో, స్థితిగతుల్లో వచ్చిన మార్పులను గమనించి ఇస్తున్న నినాదమిది. ఈ తాజా వాస్తవ పరిస్థితులను గ్రహించడంలో ప్రపంచం విఫలమైందనే చెప్పాలి. నేడు ప్రపంచ ప్రజలందరి కనీస అవసరాలను తీర్చగల స్థాయిలో ఉత్పత్తి సాగించే పరిస్థితి ఉంది. ఇవాళ మనుగడ కోసం పోరాటం చేయవలసిన అవసరమో, దుస్థితో మనకు లేదు. ఇవి యుద్ధానికి రోజులు కావు, కాకూడదు. నేడు వాతావరణ మార్పులు, ఉగ్రవాదం, మహమ్మారులు మనముందు పెనుసవాళ్లుగా నిలుస్తున్నాయి. వీటిని మనం కలిసికట్టుగా ఎదుర్కోవాలే తప్ప పరస్పర కలహాలతో పొద్దుపుచ్చరాదు. నేడు మానవాళి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపగల స్థాయికి ఆధునిక సాంకేతికతలు చేరుకున్నాయి. డిజిటల్ సాంకేతికతల వ్యాప్తి వల్ల సువిశాల వర్చువల్ లోకాల్లోకి ప్రవేశిస్తున్నాం.
ప్రపంచానికి దర్పణం
ప్రపంచ జనాభాలో ఆరోవంతు భారత్‌లోనే నివసిస్తోంది. ఇది ఎన్నో భాషలు, మతాలు, సంప్రదాయాలు, విశ్వాసాలకు నిలయం. యావత్ ప్రపంచానికీ దర్పణం వంటిది. సమష్టి నిర్ణయ ప్రక్రియ భారత్‌లో అనాది నుంచీ ఉంది. ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికలాంటి డీఎన్‌ఏ ఇది. ప్రాచీన ప్రజాస్వామ్యానికి పుట్టిల్లు అయిన భారత్‌లో జాతీయ ఏకాభిప్రాయాన్ని నిరంకుశ ఆదేశాలతో కాకుండా స్వేచ్ఛాగళాల సామరస్య గీతంతో సాధిస్తున్నాం.
నేడు ప్రపంచంలోని పెద్ద దేశాలన్నింటిలోకీ భారతదేశమే అత్యంత వేగంగా అభివృద్ధి సాధిస్తోంది. మన పౌర కేంద్రిత పాలనా విధానం ప్రతిభావంతులైన యువతలో సృజనాత్మకత వెల్లివిరియడానికి దోహద పడటమే కాకుండా, అత్యంత బలహీన వర్గాల వాణికీ వేదిక కల్పిస్తోంది. జాతీయాభివృద్ధి అనేది పైనుంచి వచ్చే ఆదేశాలతో కాకుండా, ప్రాథమిక స్థాయి నుంచే ప్రజాఉద్యమంగా సాగాలని భారత్ నమ్ముతోంది. భారత్ గడించిన అమూల్య అనుభవం అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారం చూపగలుగుతుంది. ఇలాంటి అనుభవ జ్ఞానాలను, ఆచరించిన అభివృద్ధి నమూనాలను జీ20 అధ్యక్ష హోదాలో ఇతరులతో, ముఖ్యంగా వర్ధమాన దేశాలతో పంచుకుంటాం. ఆ దేశాల వాణికి తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. దీన్ని సరిదిద్దడానికి జీ20 సారథిగా భారత్ ప్రయత్నిస్తుంది. అందువల్ల కేవలం జీ20 సభ్యదేశాలతోనే కాకుండా వర్ధమాన దేశాలతోనూ సంప్రదించి ప్రాధాన్యాలను నిర్ణయిస్తాం. వాటి అమలుకు కృషి చేస్తాం.
చేయీచేయీ కలిపి...
మనకున్నది ఒకటే భూమి. వాతావరణ మార్పులతో, యుద్ధాలతో భూమికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి జీ20 కూటమి ప్రయత్నిస్తుంది. మనది ఒకే కుటుంబం కాబట్టి సామరస్య సంబంధాలను వృద్ధి చేసుకుందాం. తద్వారా ఒకే భవిత కోసం సమష్టి యజ్ఞం చేపడదాం. ఇవే జీ20 ప్రాధాన్యాలవుతాయి. భూమికి జరిగిన గాయాలను మాన్పడానికి పర్యావరణ హిత, సుస్థిర జీవన శైలులను ప్రోత్సహిద్దాం. ప్రకృతి సంరక్షణకు మానవులు ధర్మకర్తల్లా వ్యవహరించాలనే ప్రాచీన భారతీయ సూక్తి ఇక్కడ ఆదర్శమవుతుంది. మానవులంతా ఒకే కుటుంబమనే భావనను పరిపుష్టం చేయడానికి ఆహారం, ఎరువులు, ఔషధాల సరఫరాలో రాజకీయాలను నివారిద్దాం. సొంత కుటుంబాల్లో ఈ అత్యవసరాలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని యావత్ మానవ కుటుంబానికీ వర్తింపజేద్దాం.
భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మానవులను సంక్షోభంలోకి నెట్టకూడదు. జనహనన ఆయుధాల వల్ల ప్రమాదాన్ని నివారించి అంతర్జాతీయ భద్రతను పటిష్ఠం చేయాలి. దీనికోసం అత్యంత శక్తిమంతమైన దేశాల మధ్య సంప్రదింపులు జరిగి కార్యాచరణ చేపట్టాలి. తద్వారా మనందరికీ ఒకే ఉజ్వల భవిత సమకూరుతుందనే నమ్మకాన్ని భావి తరాలకు ప్రసాదించినవారమవుతాం. భారత్ జీ20 అధ్యక్ష హోదాలో అన్ని దేశాలను, అన్ని వర్గాలను కలుపుకొనిపోయే సమ్మిళిత అభివృద్ధి నమూనాను అనుసరిస్తుంది. ఆచరణకు ప్రాధాన్యమిచ్చే నిర్ణయాత్మక అజెండాను చేపడుతుంది. ఆశాభావం, ఉపశమనం, సామరస్యాలు వెల్లివిరిసే ప్రపంచ సృష్టికి భారత్ పాటుపడుతుంది. మానవ కేంద్రిత ప్రపంచీకరణ అనే నూతన లక్ష్య సాధనకు అందరం చేయీచేయీ కలిపి ముందుకు సాగుదాం!
(నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి)