సేద్యానికి సంబంధించి- రబీ ముగింపు దశకొచ్చి కోతలు పూర్తయ్యాక ఖరీఫ్ కోసం విస్తృత సన్నాహాలు మొదలయ్యే అత్యంత కీలక సంధికాలమిది. ఆ కారణంగానే, దేశవ్యాప్తంగా రెండోదశ లాక్‌డౌన్ నుంచి అన్ని రకాల వ్యవసాయ, మార్కెటింగ్ కార్యకలాపాలను మినహాయిస్తూ కేంద్రం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. అవి వెలుగుచూసిన రోజే, నైరుతి రుతుపవనాలపై భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) ముందస్తు అంచనాల్ని వెల్లడించింది.
జూన్ నెలలో రుతుపవనాల ఆగమనం కొంత ఆలస్యమైనా, ఈసారి సాధారణ వర్షపాతమే నమోదు కానుందని ఐఎమ్‌డీ ధీమాగా చెబుతోంది. అనుకున్నదానికన్నా రుతుపవనాల రాకడ పదకొండు రోజులపాటు జాప్యమై నిరుటి జూన్‌లో 35శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది. ఈసారి దేశమంతటా సాధారణ వర్షం కురుస్తుందంటున్న ఐఎమ్‌డీ- రుతుపవనాల రెండోదశలో ‘లా నినా’ ఏర్పడి జోరువానలు పడతాయంటోంది. మహమ్మారి కరోనా వైరస్ ధాటికి చతికిలపడ్డ దేశార్థికం ఎంతో కొంత పుంజుకోవడానికి రుతుపవనాల కరుణే దోహదపడాలి! మాంద్యాన్ని వెన్నంటి రంగాలవారీగా ప్రతికూల ప్రభావం కనబరచిన కరోనా మూలాన దాపురించిన ఆర్థిక అల్లకల్లోలానికి ఆహార సంక్షోభం జతపడరాదంటే- ప్రభుత్వాలు శాయశక్తులా శ్రమించి ఖరీఫ్‌ను ప్రాణప్రదంగా కాపాడుకోవాలి. ఈ రబీలో దేశ రైతాంగాన్ని వరస ఎదురు దెబ్బలు కుంగదీశాయి. కోతలు ముమ్మరంగా సాగాల్సిన దశలో అటు యంత్రాలకు, ఇటు కూలీలకు తీవ్ర కొరత- అన్నదాతల ఆశల్ని ఆవిరి చేస్తోంది. వీలైనంతలో పండ్లు, కూరగాయలకు గిట్టుబాటు లభించేలా చూడటంలో సంబంధిత యంత్రాంగం తలమునకలుగా నిమగ్నమైనప్పటికీ- చాలాచోట్ల కోత ఖర్చులైనా రాక, పారబోతే శరణ్యమనే రైతుల దుస్థితి నిశ్చేష్టపరుస్తోంది. ఈ కడగండ్లేమీ ఖరీఫ్‌లో పునరావృతం కానివ్వని రీతిలో పంటల ప్రణాళికలు పదును తేలాలి!
కనీస లాభం రావాలి..
సర్కారీ చిరుద్యోగితో సమానంగానైనా రైతు కుటుంబానికి ఆదాయం లభించేలా చూడాలని, వైపరీత్యాలు ముట్టడించినప్పుడు ఆర్థిక తోడ్పాటు, మార్కెటింగ్ సేవల అందుబాటు వంటి చర్యలు చేపట్టాలని జాతీయ కర్షక సంఘాలు కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు మహజర్లు సమర్పిస్తున్నాయి. ఉదార చర్యల మాట దేవుడెరుగు- ఆనవాయితీగా జరగాల్సినవాటికీ ప్రతిబంధకాలు ఏర్పడుతుండటం, రైతుల పాలిట శాపమవుతోంది. యావత్ ప్రభుత్వ యంత్రాంగం కరోనా వ్యతిరేక పోరాటంలో మోహరించి ఉన్న పర్యవసానంగా, ఖరీఫ్ మౌలిక సన్నద్ధతపై అనివార్యంగా శంకలు ఉత్పన్నమవుతున్నాయి.
సాధారణంగా ఏప్రిల్ నెలలో జరపాల్సిన భూసార పరీక్షల క్రతువు ప్రస్తుత అననుకూల వాతావరణంలో నిలిచిపోయింది. జూన్ నాటికి పొలం పనులు ఊపందుకోవాలంటే- మే నెల రెండోవారానికల్లా విత్తన పంపిణీ పట్టాలకు ఎక్కాలి. ప్రభుత్వం తరఫున విత్తన పంటలు పండించి, శుద్ధీకరించి, నిల్వచేసి, సకాలంలో పంపిణీకి సహకరించాల్సిన మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్, హాకా ప్రభృత సంస్థలు చేష్టలు దక్కి చూస్తున్నాయి. విత్తే కాలం మించిపోతున్నదంటూ రైతులు గగ్గోలుపెట్టే తరుణంలో హడావుడిగా టెండర్లు ఆహ్వానించి రాజకీయ అంతేవాసులకు విత్తన పంపిణీ బాధ్యతలు కట్టబెట్టడం రాష్ట్రాల్లో రివాజుగా స్థిరపడింది. విత్తనశుద్ధి, నాణ్యతా పర్యవేక్షణ ఎండమావులై దిగుబడుల్ని, అంతిమంగా రైతుబతుకుల్ని చావుదెబ్బ తీస్తున్నాయి. కరోనా రూపేణా కారుచీకట్లు దేశాన్ని ముసిరిన వేళ, దశాబ్దాల దుర్విధానాలకు భిన్నంగా- ఖరీఫ్‌ను తేజోమయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడాలి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సరైన రుణవసతి అందించడం మొదలు సజావుగా పంటసేకరణ వరకు ఇదమిత్థమైన బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) అమలుకు అవి నిబద్ధం కావాలి!
ఇదీ చదవండి:'సినీతారలు.. మీరు నోరు మూసుకుంటే మంచిది'