అందుకే మెక్సికన్ భామలు అందరి డ్రీమ్ గర్ల్స్..! - story on mexican women beauty
వయసుతో నిమిత్తం లేకుండా నవయవ్వన ఛాయతో అందంగా మెరిసిపోవాలని కోరుకోవడం సహజం. ఈ విషయంలో ఏ దేశ మగువలు అతీతులు కారనే చెప్పాలి. వయసుతో పాటు తమ అందాన్ని కూడా ఇనుమడింపజేసుకుంటూ.. ప్రపంచ దేశాల కలల రాణులుగా వెలిగిపోతున్నారు మెక్సికన్ బ్యూటీస్.
నిత్య జీవితంలో ఆధునిక టెక్నాలజీని స్వాగతించినా.. సౌందర్య పోషణ విషయానికొచ్చేసరికి మాత్రం పూర్వీకులు ఆచరించిన సహజ సిద్ధ పద్ధతులకే మా ఓటు అంటున్నారు మెక్సికన్ మగువలు. మరి ప్రకృతి ప్రసాదించిన వనరులతో అందాల దేవతలను తలపిస్తున్న మెక్సికన్ భామల సౌందర్యం వెనక దాగున్న రహస్యాలను మనమూ తెలుసుకుందాం రండి..
క్యాక్టస్‌తో కాంతి..
ఎడారి మొక్కగా పేరుగాంచిన ఈ క్యాక్టస్‌ని ఇంట్లో పెంచుకోవడానికి ఒకప్పుడు చాలామంది ఇష్టపడేవారు కాదు. కానీ కాలం మారుతున్న కొద్దీ ఈ మొక్క ఇప్పుడు ఇంటి అలంకరణలో భాగమైపోయింది. కేవలం ఇంట్లో కళగా కనిపించడమే కాదు.. మేని మెరుపుకి కూడా ఉపయోగపడుతుందీ క్యాక్టస్ మొక్క. ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా ప్రపంచానికి చాటి చెప్తున్నారు మెక్సికో భామలు. ఈ మొక్క చుట్టూ ముళ్లుంటాయి కనక చాలా జాగ్రత్తగా క్యాక్టస్ ఆకుని కట్ చేసి అందులోని గుజ్జుని వేరు చేయాలి. ఇప్పుడా గుజ్జుకు సరిపడా తేనెని కలిపి ముఖానికి పూతలా అప్లై చేసుకోవాలి.
మసాజ్ చేస్తున్నట్లు చేత్తో మృదువుగా రుద్దాలి. ఆపై ఓ 20 నిమిషాల పాటు ఆరనిచ్చి.. చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ మొక్క గుజ్జులోని విటమిన్లు, యాంటీ-ఆక్సిడెంట్లు చర్మానికి లోపలి నుండి పోషణని అందించి ముఖం కాంతులీనేలా చేస్తాయి. మరి మెక్సికన్లు పాటిస్తున్న ఈ అందాల చిట్కాను పాటించి మీరు కూడా అందాల తారల్లా మెరిసిపోండి.
చెట్టు బెరడుతో పునరుత్తేజం..
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మ నిగారింపు తగ్గడం కామనే. కానీ పెరిగిపోతున్న కాలుష్యం వల్ల చిన్న వయసు వారి చర్మం కూడా నిర్జీవంగా తయారవుతోంది. ఇదే కాదు.. దుమ్ము, ధూళి ప్రభావం వల్ల తలెత్తే చర్మ సమస్యల గురించి చెప్పుకుంటూ పోతే ఓ పెద్ద లిస్టే తయారవుతుంది. ఇలా నిర్జీవంగా మారిన చర్మానికి పునరుత్తేజం అందించడానికి Tepezcohuite అనే చెట్టు బెరడుని ఉపయోగిస్తారు మెక్సికన్ మహిళలు. ఈ చెట్టు బెరడు నుండి తయారుచేసిన పొడికి సమపాళ్లలో ముల్తానీ మట్టి, కొబ్బరి లేదా ఆలివ్ నూనెలను కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్‌లా అప్లై చేసుకోవాలి. అలా ఓ15-20 నిమిషాల పాటు ఆరనిచ్చాక చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ చెట్టు బెరడును ఉపయోగించడం వల్ల నిర్జీవంగా మారిన చర్మం తిరిగి మెరుపు సంతరించుకుంటుంది. ఇక ఈ మాస్క్‌లోని ముల్తానీ మట్టి వల్ల కమిలిన చర్మానికి సాంత్వన లభిస్తుంది. దీనితో పాటు ఇందులో ఉపయోగించిన నూనె చర్మానికి సహజ తేమలను అందించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
కిత్తలి తేనెతో నవయవ్వనం..
అడవుల్లో సహజంగా లభించే తేనెలానే కొన్ని చెట్ల నుండి సహజంగా తేనెలాంటి పదార్థం లభ్యమవుతుంది. అటువంటి వాటిలో కిత్తలి మొక్క నుండి లభించే తేనె లేదా సిరప్ ఒకటి. ఇది నేచురల్‌గా చాలా తియ్యగా ఉండడం వల్ల దీన్ని తేనె లేదా పంచదారకు బదులుగా ఉపయోగిస్తుంటారు. ఇది కేవలం ఆహారానికి తియ్యదనాన్ని అందించడం మాత్రమే కాదు.. చర్మం నవయవ్వనంగా ఉండేలా చేయగల మహత్తు దాగుంది ఈ కిత్తలి తేనెలో. అందుకోసం.. ఈ మొక్క సిరప్‌కు ఓట్స్ లేదా ఉడికించిన అన్నం కలిపి మిశ్రమంలా తయారు చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.. ఆపై కాసేపాగి శుభ్రం చేసుకోవాలి.
ఇందులోని అమైనో షుగర్స్, మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల ముఖంపై ఏర్పడిన ముడతలు, వయసు పైబడిన ఛాయలకు చెక్ పెట్టినట్లవుతుంది. పెదవులు చీలి రక్తం కారడం లాంటివి తరచుగా జరుగుతుంటే ఈ చెట్టు సిరప్‌ని రాయడం వల్ల ఉపశమనం లభించడంతో పాటు క్రమంగా అధరాలు మృదువుగా మారతాయి. అంతేకాకుండా కళ్ల కింది నల్లటి వలయాలను కూడా తగ్గించే గుణముందీ తేనెలో.
అవకాడోతో జుట్టు సమస్యలకు చెక్..
కాలుష్యం వల్ల చర్మంతో పాటు.. జుట్టు విషయంలో కూడా చాలా సమస్యలు తలెత్తుతాయి. చుండ్రు, జుట్టు తేమను కోల్పోయి నిర్జీవంగా మారడం, జుట్టు రాలడం.. ఇలా చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నింటికీ పరిష్కారం అవకాడో అంటున్నారు మెక్సికో భామలు. మెత్తగా రుబ్బిన అవకాడోకు సమపాళ్లలో ఆలివ్ నూనెను కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించాలి. అలా ఓ అరగంటపాటు ఆరనిచ్చాక గాఢత తక్కువ గల షాంపూతో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు బలం చేకూరి జుట్టు రాలడం తగ్గుతుంది. అవకాడోలోని అమైనో యాసిడ్లు, విటమిన్లు జుట్టు పొడవుగా పెరగడానికి, కొత్త కురులు రావడానికి తోడ్పడతాయి. ఇక ఆలివ్ నూనె జుట్టుకు తేమనందించి మృదువుగా మారుస్తుంది. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.
స్క్రబ్‌తో నిగారింపు..
ఎన్ని ఫేస్‌మాస్క్‌లు వేసుకున్నా.. శరీరానికి అప్పుడప్పుడూ స్క్రబ్‌ని ఉపయోగించడం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ట్యాన్ తొలగి నిగారింపు సంతరించుకుంటుంది. అందుకోసం మన ఇంట్లో సాధారణంగా లభించే పంచదార లేదా ఉప్పుకి మించినది లేదంటున్నారు ఈ ముద్దుగుమ్మలు. స్నానమాచరించే సమయంలో వారంలో రెండు లేదా మూడు సార్లు బ్రౌన్ షుగర్ లేదా ఉప్పును ఉపయోగించి శరీరమంతటా మృదువుగా రుద్దడం ద్వారా చర్మంపై మృతకణాలు, నల్లటి వలయాలు తొలగి మెరుపు సంతరించుకుంటుంది. దీనితో పాటు స్క్రబ్‌కి కాస్త తేనెను కలిపితే చర్మానికి సహజ తేమలను అందించవచ్చు. ఇలా మృదువైన, ఆరోగ్యమైన చర్మాన్ని ఎంతో సులభంగా పొందవచ్చనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇది చదవండి కరోనా కాలంలో ఇంటర్వూలకు హాజరయ్యేదెలా..??