Kadapa Transport Deputy Commissioner Transferred: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డిపై బదిలీ వేటు పడింది. రాష్ట్ర రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయన్ని ప్రభుత్వం ఆదేశించింది. 2 నెలల కిందట కడప రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్‌రెడ్డి ఇదే కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మహిళా బ్రేక్ ఇన్‌స్పెక్టర్ ఫోన్‌కు తరచూ అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు తెలిసింది. ఉన్నతాధికారి కావడంతో ఆయన చేష్టల్ని సదరు మహిళా ఉద్యోగి మౌనంగా భరిస్తూ వచ్చారు.
కానీ గురువారం నాడు భర్త లేని సమయం చూసి చంద్రశేఖర్‌రెడ్డి ఏకంగా ఆమె ఇంటికి వెళ్లారు. చంద్రశేఖర్‌రెడ్డి వస్తున్నారనే విషయాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా తెలుసుకున్న మహిళా ఉద్యోగి వెంటనే భర్తకు ఫోన్ చేసి సమాచారమిచ్చారు. మహిళా ఉద్యోగి ఎంతకీ తలుపు తీయకపోవడంతో చంద్రశేఖర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వేరే జిల్లాలో ఉన్న మహిళా ఉద్యోగి భర్త కడపకు వచ్చి నేరుగా డీటీసీ కార్యాలయానికి వెళ్లారు. మహిళా ఉద్యోగి భర్త, కుటుంబసభ్యులు కలిసి డీటీసీని చితకబాదారు. పరువు పోతుందని భావించిన చంద్రశేఖర్‌రెడ్డి మహిళా ఉద్యోగి కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరినట్లు సమాచారం.
ఈ వ్యవహారం ఉన్నతాధికారులకు తెలియడంతో చంద్రశేఖర్‌రెడ్డిపై బదిలీ వేటు వేశారు. బాధిత మహిళా ఉద్యోగి నుంచి ఉన్నతాధికారులు ఫిర్యాదు తీసుకోనున్నారు. ఈ మేరకు ఇరువురినీ విజయవాడ కమిషనర్ కార్యాలయానికి రావాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి డీటీసీపై కఠిన చర్యలకు ఆదేశించారు. మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించేవారిని ఉపేక్షించబోమన్న మంత్రి బాధిత మహిళకు అండగా ఉంటామని అన్నారు.
గుడివాడ 'గుండా'నే అనధికారిక ఎమ్మెల్యే! - బ్యాచ్‌తో దందాలు, సెటిల్‌మెంట్లు