Snoring Causes Health Issues : గురక సమస్య చిన్నదేమి కాదని.. బాధితుల గుండె ఆరోగ్యానికి ఇది పెను ప్రమాదమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనినే అబ్‌స్ట్రెక్టివ్ స్లీప్ అప్నీయా(ఓఎస్‌వో)గా వ్యవహరిస్తారు. తీవ్రత ఎక్కువుంటే చికిత్స తప్పనిసరిగా పేర్కొంటున్నారు. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలాహిరీ ఇదే సమస్యతో చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చాలామంది ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వైద్యులు తెలిపారు. నగరంలో 40-60 ఏళ్ల వయసు వారిలో 20-25 శాతం మంది ఓఎస్‌వో సమస్యతో బాధ పడుతున్నారనేది అంచనా. అవగాహన లేక చాలామంది చికిత్స తీసుకోవడం లేదు. ముదిరిపోతే గుండెపై ప్రభావం చూపుతుందని, కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. అధిక బరువు ఉన్న వారిని ఓఎస్‌వో మరింత ఇబ్బంది పెడుతుంది. దీనికి పొగ తాగడం, మద్యపానం తోడైతే..సమస్య ఇంకా ఎక్కువ అవుతోంది. అధిక రక్తపోటు, మధుమేహం కూడా ఓఎస్‌వోకు కారణమే. మహిళలతో పోల్చినప్పుడు పురుషుల్లో ఎక్కువ మంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. మహిళల్లో రుతుక్రమం ఆగిన తర్వాత ఓఎస్‌వో పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
ఎప్పుడు సంప్రదించాలంటే.. :
Snoring Causes Heart Attack : "గురక పెట్టే వారందరికి ఓఎస్‌వో ఉన్నట్లు కాదు. ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, లేదంటే వేరే కారణాలతో కొందరిలో గురక వస్తుంటుంది. ఇది ప్రమాదం కాదు. అధిక బరువు, ఇతర సమస్యలతో గురక పెట్టే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులను సంప్రదించి స్లీప్ స్టడీ చేయించుకోవాలి. ఎన్నో ఆధునాతన చికిత్సలు ఉన్నాయి. ఓఎస్‌వో వల్ల శ్వాస సక్రమంగా ఆడక రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి. హృదయ నాళ వ్యవస్థ దెబ్బతింటుంది. ఓఎస్‌వో తీవ్రంగా ఉంటే కరోనరీ ఆర్టీరీలో సమస్యలు, గుండెపోటు, ఆకస్మికంగా గుండె ఆగిపోవడం జరుగుతుంది. అంతర్లీనంగా గుండె జబ్బులు ఉంటే మరింత ప్రమాదం."
- డాక్టర్ రఘుకాంత్, శ్వాసకోశ వ్యాధి నిపుణులు, మెడికవర్
ప్రధాన కారణాలు ఇవి..
- అధిక బరువు, ఊబకాయం
- హైపో థైరాయిడిజం
- మెడభాగం తక్కువగా ఉండటం
- నాలుక దళసరిగా మారటం
- దవడ భాగం లోపలకి ఉండటం
- నోరు, ముక్కులో సమస్యలు
- అధిక రక్తపోటు, మధుమేహం
ఈ లక్షణాలు గుర్తిస్తే..
- రాత్రి పూట పెద్ద శబ్దంతో గురక పెట్టడం
- నిద్రలో శ్వాస ఆగిపోయి ఒక్కసారిగా మెలకువ రావటం
- పగటిపూట ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవడం
- ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి
- కుంగుబాటు, చిరాకు, ఏకాగ్రత లేకపోవడం
ఇదీ చూడండి :
బప్పి లహిరి ప్రాణాలు తీసిన వ్యాధి.. ఎందుకొస్తుంది? అరికట్టడం ఎలా?