Engineering Colleges Management Association Meets Lokesh : కూటమి ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవని చర్చలు, సంప్రదింపుల ద్వారానే విధానపర నిర్ణయాలు తీసుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. సంస్కరణలు అమలు చేసే క్రమంలో ఏవైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉండవల్లి నివాసంలో ఇంజినీరింగ్ కళాశాలల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి లోకేశ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఇంటర్ విద్యలో ఎన్నో మార్పులు : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో నాణ్యత పెంచడంపై యాజమాన్యాలు దృష్టి సారించాలని మంత్రి లోకేశ్ సూచించారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విద్యావ్యవస్థ నిర్వీర్యమైనందున ప్రాథమిక స్థాయి నుంచే పరివర్తనకు కృషి చేస్తున్నామన్నారు. గత పదేళ్లుగా సంస్కరణలు లేని ఇంటర్ విద్యలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
ప్లేస్‌మెంట్స్ వివరాలు తెలపాలి : అన్ని విద్యాసంస్థల్లో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో పెరగాల్సి ఉందన్నారు. విద్యావ్యవస్థలో నైతిక విలువలతో కూడిన సంస్కరణలు తేవాలన్నదే తమ లక్ష్యమని లోకేశ్ స్పష్టం చేశారు. ఆర్టీఎఫ్ స్కాలర్ షిప్‌లకు సంబంధించి తొలివిడతలో రూ.788 కోట్లకు గాను, ఇప్పటికే రూ.571.96 కోట్లు విడుదల చేశామన్నారు. రెండు, మూడు రోజుల్లో మిగిలిన రూ.216.04 కోట్లు కూడా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్లేస్‌మెంట్స్ వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వానికి తెలపాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.
ప్రస్తుత ఫీజులతో గిట్టుబాటు కాదు : ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించి ఇంజనీరింగ్ విద్య నాణ్యత పెంచేందుకు అందరి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును ఎప్పటికప్పుడు క్యాలండర్ ప్రకారం విడుదల చేయాలని అసోసియేషన్ ప్రతినిధులు మంత్రిని కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఫీజులు గిట్టుబాటుగా లేనందున సవరించాలని మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పర్చూరి అశోక్ బాబు, వేపాడ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్: నారా లోకేశ్
త్వరలో ప్రతి శనివారం 'నో బ్యాగ్‌డే' - ఉపాధ్యాయులకు ఒకటే యాప్: మంత్రి లోకేశ్