Ratha Saptami Celebrations 2025 in Tirumala : రథసప్తమి వేడుకలకు తిరుమల సుందరంగా ముస్తాబైంది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు సప్తవాహనాలపై పయనించే శ్రీనివాసుని దర్శనానికి వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. మలయప్ప స్వామి ఊరేగింపు కోసం తిరుమల మాడ వీధులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మాడ వీధుల్లో ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తదితరులు పరిశీలించారు.
3 లక్షల మంది భక్తులు రాక! : గ్యాలరీల్లో అన్న ప్రసాదం పంపిణీ, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు వంటి సౌకర్యాలను తనిఖీ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో మాడ వీధుల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ, రథసప్తమికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. రథసప్తమి వేడుకలకు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్టు వెల్లడించారు.
సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా : భక్తులకు ఎండ వేడి తగలకుండా షెడ్లు ఏర్పాటు చేశామని శ్యామలరావు వివరించారు. మాడ వీధుల్లో ఉన్న భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు. మంగళవారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ వరకు అన్న ప్రసాదాల పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘాతోపాటు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి రెండు రెట్లు అధిక భద్రత కల్పిస్తున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు.
రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు - సిఫార్సు లేఖల దర్శనాలు రద్దు: బీఆర్ నాయుడు
తిరుమలలో రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం - ఏడు వాహనాలపై స్వామి వారికి సేవ