Swimming Competitions in Vijayawada 2025 : ఆరోగ్యానికి ఈత ఎంతో అవసరమని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఆక్వా డెవిల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 25వ కృష్ణా రివర్ క్రాసింగ్ (1.5 KM) పోటీలను విజయవాడ దుర్గా ఘాట్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ఈత ద్వారా శరీరానికి చక్కని వ్యాయామం అవుతుందని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పదేళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు, వివిధ ప్రాంతాల వారు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా పోటీల నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు.
ప్రతి జూన్ నెలలో శిక్షణ : అనంతరం ఆక్వాడెవిల్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెలగపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి జూన్ నెలలో పిల్లలకు ఈతలో శిక్షణ ఇస్తామని తెలిపారు. పోటీల కన్వీనర్ డి. యుగంధర్ మాట్లాడుతూ, కోల్‌కత్తా, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పోటీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. సుమారు 600 మంది ఈత పోటీల్లో పాల్గొన్నారని చెప్పారు. పలువురు విభిన్న ప్రతిభావంతులు సైతం పాల్గొన్నారన్నారు.
విజేతలకు బహుమతులు : అనంతరం కృష్ణానది తాడేపల్లి కరకట్టపై ఉన్న ఆక్వా డెవిల్స్‌లో జరిగిన ముగింపు కార్యక్రమానికి ప్రముఖ వైద్యుడు కామినేని పట్టాభిరామయ్య, పాతూరి నాగభూషణం ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ప్రశంసాపత్రాలు, పతకాలు బహూకరించారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షుడు లింగపల్లి రామకృష్ణ, కార్యదర్శి మందపాటి నరసరాజు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.