Prigozhin Russia : వాగ్నర్ గ్రూప్‌నకు అధ్యక్షత వహించిన ప్రిగోజిన్.. రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోనే ఉన్నట్లు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో గురువారం తెలిపారు. అయితే రష్యాపై తిరుగుబాటు ప్రయత్నం చేసిన తర్వాత వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ బెలారస్‌కు వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. కానీ ఈ వ్యవహరానికి సంబంధించిన ఈ కీలక విషయం తాజాగా బయటపడింది.
పుతిన్ ప్రైవేటు సైన్యమైన వాగ్నర్ గ్రూపు జూన్ 24న రష్యా అధినేతపైనే తిరుగుబాటుకు యత్నించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుతిన్-ప్రిగోజిన్‌ల మధ్య బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మధ్యవర్తిత్వం వహించి తిరుగుబాటుకు అడ్డుకట్ట వేశారు. అనంతరం ప్రిగోజిన్, ఆయన దళానికి భద్రతపరమైన హామీలు ఇవ్వడమే కాకుండా వారిని బెలారస్‌కు వచ్చేందుకు లుకషెంకో అనుమతి కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రిగోజిన్ బెలారస్ చేరుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. దీనిపై స్పందించిన లుకషెంకో.. వాగ్నర్ చీఫ్ బెలారస్‌లోనే ఉన్నారని గతవారం తెలిపారు.
అయితే లుకషెంకో తాజాగా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ప్రిగోజిన్ బెలారస్‌లో లేరని, ప్రస్తుతం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఉన్నారని చెప్పడం గమనార్హం. కానీ, వాగ్నర్ క్యాంపులు మాత్రం ఎక్కడ ఉన్నాయనే విషయాన్ని ఆయన చెప్పలేదు. సంధిలో చేసుకున్న పలు హామీలను ఖరారు చేసుకోవడానికే ప్రిగోజిన్ రష్యాకు చేరుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రిగోజిన్ కార్యాలయంపై క్రెమ్లిన్ దాడులు..
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ కార్యాలయం, ఇంటిపై బుధవారం దాడులు జరిగాయి. దాడులు నిర్వహించిన వివిధ ప్రాంగణాల నుంచి భారీగా బంగారం, నగదు, విగ్గులు, ఆయుధాలు, పాస్‌పోర్టులు, ఓ స్లెడ్జి హ్యామర్‌ను స్వాధీనం చేసుకొన్నట్లు క్రెమ్లిన్ అనుకూల మీడియా సంస్థ ఇజ్వెస్టియా పేర్కొంది. ఈ మేరకు ఓ భవనంలోని ఫొటోలు, వీడియోలను బయటకు విడుదల చేసింది.
ప్రిగోజిన్ బెలారస్‌లో లేడని వెల్లడించిన సమయంలో ఈ కథనాలు వెలువడటం గమనార్హం. అతడు సెయింట్ పీటర్స్‌బర్గ్ లేదా మాస్కోలో ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అత్యంత విలాసవంతమైన ఇంట్లో ప్రిగోజిన్ ఉంటున్నట్లు ఫొటోలను చూస్తే తెలుస్తుంది. మార్బుల్‌తో నిర్మించిన ఇంటిలో అత్యంత ఖరీదైన పియానో, స్పా, ప్రైవేట్ ఇండోర్ స్విమ్మింగ్ పూల్, 'కీలకమైన చర్చల్లో వాడటానికి' అని రాసిఉన్న భారీ సుత్తి, బిలియర్డ్స్ రూమ్ , ప్రైవేటు ప్రార్థనా మందిరం వంటివి ఉన్నాయి. దీంతోపాటు భారీగా పతకాలతో అలంకరించిన సైనిక యూనిఫామ్, పెద్ద మొత్తంలో నగదు కూడా ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌బీ పేర్కొంది.
ఉక్రెయిన్‌పై రష్యా మరో క్షిపణి దాడి..
రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై గురువారం క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో నలుగురు మరణించగా.. అనేక మంది గాయపడ్డారు. మృతుల్లో 95 ఏళ్ల వృద్ధుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ దాడిలో దాదాపు 60 అపార్ట్మెంట్లు, 50 కార్లు దెబ్బతిన్నాయని.. ఎల్వివ్ మేయర్ ఆండ్రీ సడోవి తెలిపారు.