China Second bridge pangong: తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా తన సైనిక కార్యకలాపాలను ఉద్ధృతంగా కొనసాగిస్తోంది. ఆయాప్రాంతాలకు తమ సేనలను వేగంగా తరలించేందుకు వీలుగా వ్యూహాత్మకంగా కీలకమైన పాంగాంగ్ సరస్సుపై రెండో వంతెన నిర్మాణం చేపడుతోంది. ఉపగ్రహ చిత్రాలతోపాటు అక్కడి పరిణామాలు తెలిసినవారు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. 2020 ఆగస్టులో పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో డ్రాగన్ బలగాలు అడ్డుకోవడం వల్ల భారత సైన్యం దక్షిణ తీరంలో అనేక వ్యూహాత్మక శిఖర ప్రాంతాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే చైనా తన సైనిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటంపై దృష్టి సారించింది. పాంగాంగ్ సరస్సు ప్రాంతంలోనే చైనా ఇప్పటికే ఓ వంతెన నిర్మాణం పూర్తి చేసింది.
China Ladakh bridge: వాస్తవాధీన రేఖకు 20కిలోమీటర్లకుపైగా దూరంలో పాంగాంగ్ సరస్సుపై చైనా రెండో వంతెన నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. ఎల్ఏసీ వెంట చైనీస్ కార్యకలాపాలను ట్రాక్ చేసే జియో స్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్.. కొత్త వంతెన నిర్మాణం ఉపగ్రహ చిత్రాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మొదటి వంతెనకు సమాంతరంగా కొత్తగా పెద్ద వంతెన నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. సరస్సుపై నుంచి భారీగా మిలిటరీ కార్యకలాపాలు సాగించటమే లక్ష్యంగా కొత్త వంతెన నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. సైమన్ ఉపగ్రహచిత్రాల ప్రకారం రెండువైపుల నుంచి ఏకకాలంలో వంతెన నిర్మాణం జరుగుతోంది. ఈ వంతెన నిర్మాణంతో లోతైన రుడోక్ ప్రాంతం నుంచి పాంగాంగ్ సరస్సులోని ఎల్ఏసీ పరిసర ప్రాంతాల మధ్య దూరం గణనీయంగా తగ్గనుంది.

మరోవైపు, సైనిక సన్నద్ధతలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో భారత్ కూడా వంతెనలు, రహదారులు, టన్నెళ్ల నిర్మాణాలు చేపడుతోంది. రెండేళ్ల నుంచి తూర్పు లద్దాఖ్‌లోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ డ్రాగన్ చేపడుతున్న రెండో వంతెన నిర్మాణంపై రక్షణ శాఖ స్పందించాల్సి ఉంది.
ఇదీ చదవండి: