Air India Turbulence : దిల్లీ నుంచి సిడ్నీ బయలుదేరిన ఎయిర్ఇండియాకి చెందిన B787-800 విమానం గాల్లో ఒత్తిడి కారణంగా భారీ కుదుపులకు గురైంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ విమానాశ్రయానికి చేరుకోగానే ప్రయాణికులకు వైద్య సహాయం అందించినట్లు విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పేర్కొంది. ఘటనలో ప్రయాణికులెవరూ ఆసుపత్రి పాలుకాలేదని తెలిపింది. ఏడుగురు ప్రయాణికులకు కండరాల‌్లో చిన్నపాటి బెణుకు కలిగిందని... విమానంలో ప్రయాణిస్తున్న డాక్టర్, నర్సు సాయంతో వారికి అత్యవసర ప్రథమ చికిత్స అందించినట్లు విమానవర్గాలు తెలిపాయి. ఈ ఘటన మంగళవారం (మే 16) జరగగా దీనికి సంబంధించిన వివరాలను డీజీసీఏ బుధవారం ప్రకటించింది. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎయిర్ఇండియా నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
విమానంలో ప్రయాణికురాలిని కుట్టిన తేలు..!
గతనెల ఏప్రిల్ 23న ఇదే ఎయిర్ఇండియాకు చెందిన AI 630 అనే విమానంలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికురాలిని ఓ తేలు కుట్టింది. దీంతో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. నాగ్‌పుర్ నుంచి ముంబయికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. గాయపడిని ప్యాసెంజర్‌కు ముందుగా విమానంలోనే ప్రథమ చికిత్సను అందించారు. అనంతరం విమానాశ్రయం చేరుకోగానే ఆస్పత్రిలో చేర్పించి వైద్య సహాయం అందించారు. తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎయిర్ఇండియా.. ఇది చాలా దురదృష్టకరమని.. ప్రయాణికురాలికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. అయితే ఈ మధ్య విమానాల్లో పక్షులు, ఎలుకలు కూడా సంచరిస్తుండటం విమాన కంపెనీల తనిఖీల లేమికి అద్దం పడుతోందని కొందరు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
కాక్‌పిట్‌లో స్నేహితురాలితో పైలట్!
నిబంధనలకు విరుద్ధంగా ఓ పైలట్ విమానంలోని కాక్‌పిట్‌లోకి స్నేహితురాలిని పిలిపించుకున్న ఘటనపై DGCA విచారణకు ఆదేశించింది. దుబాయి నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ఇండియా విమానంలో ఫిబ్రవరి 27న జరిగిన ఈ ఘటన ఏప్రిల్ 21న ఆలస్యంగా వెలుగుచూసింది. విమానంలో ప్రయాణికురాలిగా ఉన్న ఓ యువతి తనకు స్నేహితురాలు కావడం వల్ల పైలట్ ఆమెను కాక్‌పిట్‌లోకి అనుమతించాడు. దాదాపు 3 గంటలపాటు వారిద్దరూ కాక్‌పిట్‌లోనే గడిపారు. ఈ కథనం పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.