అఫ్గానిస్థాన్‌లో దయనీయ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాలిబన్ల అరాచకాలకు వణికిపోతున్న ప్రజలు ఎప్పుడెప్పుడు దేశం వదిలి బయటపడతామా అని ఆశతో ఎదురుచూస్తున్నారు. యుద్ధంలో సహాయపడిన అఫ్గానీలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామనే బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన మేరకు కాబుల్ విమానాశ్రయానికి పోటెత్తున్నారు. వేలకొద్ది జనంతో ఎయిర్‌పోర్టు ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
రద్దీని అదుపుచేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి బ్రిటిష్ భద్రతా దళాలు. అయినప్పటికీ తోపులాటలు, తొక్కిసలాటలు కొనసాగుతూనే ఉన్నాయి. చిన్నారులు, మహిళలు నలిగిపోతున్నారు.
ఆదుకుంటానన్న బైడెన్..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా అఫ్గానీలను సురక్షిత ప్రదేశాలకు చేరవేస్తామని భరోసా ఇచ్చారు. దీంతో ఆకలి, ఆర్తనాథాలను పట్టించుకోకుండా గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబడుతున్నారు ప్రజలు. బయటపడే అవకాశం దక్కుతుందో లేదో తెలియక బిక్కుబిక్కుమంటూనే జీవిస్తున్నారు.
కాబుల్‌లో ఇలా ఓవైపు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న వేళ మరో పక్క నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు తాలిబన్లు.
'తాలిబన్లతో కలిసి పనిచేస్తాం..'
తాలిబన్ల పాలనపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ.. అవసరమైతే వారితో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్. అఫ్గాన్‌లో నెలకొన్న సమస్య పరిష్కారం కోసం దౌత్యపరమైన యత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అఫ్గాన్ సంక్షోభంపై అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించిన జాన్సన్.. అక్కడి నుంచి బ్రిటన్ పౌరులను స్వదేశానికి తరలించడానికి బలమైన సవాళ్లు ఉన్నాయని తెలిపారు.
రికార్డు స్థాయిలో..
గతవారం కాబుల్ నుంచి బయలుదేరినంలో సీ-17 విమానంలో రికార్డు స్థాయిలో 823మంది అఫ్గాన్ శరణార్థులను తరలించినట్లు అమెరికా వాయుసేన స్పష్టంచేసింది. తొలుత 640మందే అనుకున్నా.. ప్రజల ఒడిలో కూర్చున్న 183 మంది చిన్నారులను కూడా కలిపితే 823 మంది అవుతుందని వివరించింది.
ఫ్రాన్స్ సహకారం..
407మంది అఫ్గానీలు సహా 570 మందిని తమ మిలిటరీ విమానంలో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఫ్రాన్స్ వెల్లడించింది. నలుగురు ఫ్రెంచ్ పౌరులు సహా 99మంది అప్గానీలను శుక్రవారం సాయంత్రం పారిస్ తీసుకొచ్చినట్లు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది.
ఇదీ చూడండి: Afghan crisis: అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రతీకారేచ్ఛ