అఫ్గానిస్థాన్‌పై తాలిబన్ల దురాక్రమణను సమర్థిస్తూ వచ్చిన పాకిస్థాన్.. తాజాగా వారి పాలనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాలిబన్ల నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం.. అఫ్గానిస్థాన్‌లో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని నెలకొల్పుతుందని (Afghan Taliban) ఆశిస్తున్నామని పాక్ పేర్కొంది. అఫ్గాన్ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం తాలిబన్లు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. అఫ్గాన్ ప్రజలకు సాయం అందించి వారి అవసరాలు తీర్చడంలో అంతర్జాతీయ సమాజం కూడా కీలక పాత్ర పోషించాలని ఆశిస్తున్నామని పేర్కొంది.
అఫ్గానిస్థాన్‌లో శాంతిని నెలకొల్పేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని పాక్ చెప్పుకొచ్చింది. ఇందు కోసం ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 13 మంది ప్రపంచ నేతలను సంప్రదించారని తెలిపింది. 'అఫ్గాన్ అభివృద్ధి కోసం పలు దేశాలు తమ వంతు సాయం అందిస్తుంటే.. కొందరు మాత్రం అక్కడి పరిస్థితిపై దుష్ప్రచారం చేస్తున్నారు' అని పాకిస్థాన్ విదేశాంగ ప్రతినిధి అసీమ్ అహ్మద్ వ్యాఖ్యానించారు. అయితే.. అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానం కానీ సమాచారం కానీ అందలేదన్నారు.
ఇదీ చూడండి : అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడి సోదరుడిని చంపిన తాలిబన్లు!