ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు (covid cases) అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు మరోసారి లాక్డౌన్ అమలుకు మొగ్గుచూపుతున్నాయి. మరి కొన్ని దేశాలు ఆంక్షలను కఠినతరం చేయాలని ప్రయత్నిస్తున్నాయి.
వసతి గృహాలకే పరిమితం..
చైనాకు ఈశాన్య భాగంలో ఉన్న దాలియన్ నగరంలోని ఓ యూనివర్శిటీ.. సుమారు 1500 మంది విద్యార్థులను వసతి గృహాలకే పరిమితం చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఆదివారం జారీ చేసింది. స్థానికంగా ఉన్న జువాంగే యూనివర్శిటీలో డజన్ల కొద్ది.. కరోనా వైరస్ కేసులు వెలుగు చూడడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వందల సంఖ్యలో విద్యార్థులను హోటళ్లకు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.
టీకా వేయించుకోని వారికి లాక్డౌన్..
ఆస్ట్రియాలో కరోనా వైరస్ అదుపులో ఉన్నా.. పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని స్థానిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ బారిన పడకుండా.. టీకా వేయించుకోని వారికి లాక్డౌన్ విధిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అధికారులు తెలిపారు. 12 ఏళ్ల కంటే ఎక్కువ ఉండి టీకా తీసుకోని వారు అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే ఇంటి నుంచి బయటకు వెళ్లాలని చెప్పారు.
బ్రిటన్‌లో బూస్టర్ డోస్...
కొవిడ్ బూస్టర్ డోస్‌ను సోమవారం నుంచి యువకులకు కూడా ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని కరోనా కట్టడి చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 50 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే బూస్టర్ డోస్ ఇచ్చే వారు. అయితే ఈ తాజా నిర్ణయంతో చాలా మంది వ్యాక్సిన్ బూస్టర్‌ను తీసుకోవచ్చని అధికారులు తెలిపారు.
బెల్జియం ప్రభుత్వం కీలక సమావేశం...
బెల్జియంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కీలక సమావేశాన్ని బుధవారం ఏర్పాటు చేయనుంది. పెరుతున్న కరోనా కేసులతో దేశంలోని ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రతీ వారం కనీసం 30 శాతం రోగులు ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
డబుల్ డోస్ తీసుకుంటే.. నో క్వారెంటైన్..
భారత్, ఇండోనేషియాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలను సడలించేందుకు సింగపూర్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 29నుంచి సింగపూర్ వెళ్లే ప్రయాణీకులు రెండు డోసులు తీసుకుంటే క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని స్థానిక మీడియాలో కథనాలు వెలుబడ్డాయి. ఇప్పటికే 13 దేశాలకు ఇలాంటి మినహాయింపులు ఇచ్చింది సింగపూర్.
భారత్ నుంచి ఇండోనేషియాకు 5 కోట్ల డోసులు..
దేశీయంగా సీరం సంస్థ తయారు చేసిన 5కోట్ల కొవొవాక్స్ డోసులు ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ టీకాను భారత్‌లో అత్యవసర వినియోగానికి కేంద్రం ఇంతవరకు అనుమతించలేదు. సుమారు 50 లక్షల వయల్స్‌ను సీరం ఇన్స్టిట్యూట్ నుంచి ఇండోనేషియాకు ఎగుమతి చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
ఇదీ చూడండి: ఆ దేశంలో సంతోషానికి కొదవ లేదు.. జనాలే కరవు