Kim Il sung brother: ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, తొలి అధినేత కిమ్ ఇల్ సంగ్ తమ్ముడు కిమ్ యోంగ్ జు(100) కన్నుమూశారు. ఆయన మేనల్లుడు పరిపాలన పగ్గాలు చేపట్టే వరకు దేశంలో రెండో అతిపెద్ద అధికారిగా వ్యవహరించారు యోంగ్.
కిమ్ యోంగ్ జు మృతిపట్ల సంతాపం తెలిపారు.. ఉత్తర కొరియా అధినేత, కిమ్ ఇల్ సంగ్ మనుమడు కిమ్ జోంగ్ ఉన్. సంతాపం తెలుపుతూ పుష్పగుచ్ఛం పంపించినట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 'కీలక పదవుల్లో ఉన్న సమయంలో వర్కర్స్ పార్టీ విధానాలను అమలు చేసేందుకు కిమ్ యోంగ్ జు తీవ్రంగా కృషి చేశారు. సోషలిస్ట్ విధానాలు, కొరియన్ స్టైల్ సామాజిక వ్యవస్థ కోసం పాటుపడ్డారు.' అని కేసీఎన్ఏ పేర్కొంది.
అయితే, కిమ్ యోంగ్ జు ఎప్పుడు మరణించారనే విషయాన్ని వెల్లడించలేదు.
సియోల్ ఏకీకరణ మంత్రిత్వ శాఖ ప్రకారం.. యోంగ్ జు 1920లో జన్మించారు. ఆయన మరణించినప్పటికి 100 లేదా 101 ఏళ్లు ఉంటాయని పేర్కొంది. 1948లో కిమ్ ఇల్ సంగ్ దేశాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి.. కిమ్ కుటుంబానికి చెందిన మూడు తరాలు ఉత్తర కొరియాను పాలించాయి. కిమ్ ఇల్ సంగ్ 1994లో మరణించిన తర్వాత ఆయన పెద్ద కుమారుడు కిమ్ జోంగ్ ఇల్ అధికారాన్ని చేపట్టారు. ప్రస్తుత అధినేత కిమ్ జోంగ్ ఉన్.. కిమ్ జోంగ్ ఇల్ మూడో కుమారుడు. 2011లో తన తండ్రి మరణం తర్వాత అధికారంలోకి వచ్చారు.
ఇదీ చూడండి: 'అప్పటి వరకు తక్కువ తినండి'- ప్రజలకు కిమ్ పిలుపు!