కరోనా మహమ్మారి వ్యాప్తితో జరుగుతున్న ఆర్థిక, సామాజిక నష్టాలు అధిగమించేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకోవాలని జీ-20 దేశాలు తీర్మానించాయి. సౌదీ రాజు అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సదస్సులో జీ-20 దేశాలు సంఘటితంగా పోరాడాలని నిర్ణయించాయి.
కరోనా ధాటికి కుదేలైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు జీవం పోసేందుకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి 5 ట్రిలియన్ డాలర్లు చొప్పించాలని జీ-20 దేశాధినేతలు నిర్ణయించారు. ప్రపంచ సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం శక్తిమంతమైన సమన్వయ ప్రణాళికను అమలు చేయాలని నిశ్చయించారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలను రక్షించుకుంటామని తెలిపారు.
భారత పోరాటానికి ప్రశంసలు..
ప్రపంచ సంక్షోభాన్ని ధైర్యంగా ఎదుర్కోవటానికి భారీగా ఆర్థికసాయాన్ని కొనసాగిస్తామని జీ- 20 దేశాలు పేర్కొన్నాయి. మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటాన్ని జీ- 20 దేశాధినేతలు ప్రశంసించారు.
మానవాళి వికాసమే ధ్యేయంగా..
కరోనాపై పోరాడేందుకు ఒక దృఢమైన కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రధాని మోదీ జీ- 20 దేశాలకు పిలుపునిచ్చారు. కరోనా వేగంగా వ్యాప్తిస్తున్న వేళ ఆర్థిక లక్ష్యాలను కాకుండా మానవాళి వికాసాన్ని ప్రపంచాభివృద్ధికి కేంద్రంగా చేసుకోవాలని కోరారు.
"ఈ సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలి. మానవజాతి సమష్టి శ్రేయస్సు కోసం నూతన ప్రపంచీకరణ విధానం తీసుకురావాలి. మహమ్మారిని నిరోధించే వ్యాక్సిన్ల తయారీకి ప్రపంచ ఆరోగ్య సంస్థకు అధికారం ఇవ్వాలి. ఈ క్లిష్ట సమయంలో వైద్య పరిశోధన, అభివృద్ధి ఫలాలు ప్రపంచ దేశాలు ఉచితంగా పంచుకోవాలి."
- నరేంద్రమోదీ, భారత ప్రధాని
అనంతరం అబుదాబి, ఖతార్ దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడిన ఆయన ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి సమష్టిగా పనిచేయాలని నిర్ణయించిన దేశాధినేతలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇరుదేశాల మధ్య తరచుగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు.
జిన్‌పింగ్ సూచనలు..
డబ్ల్యూహెచ్ఓ నేతృత్వంలోని ఏర్పాటు చేసిన కొవిడ్- 19 సాలిడారిటీ రెస్పాన్స్ ఫండ్‌కు ఆర్థిక సహకారం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా నాయకులు స్వచ్ఛందంగా అంగీకరించారు. జీ- 20 సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రపంచ దేశాలకు కీలక సూచనలు చేశారు.
కరోనాను ఎదుర్కొనేందుకు దేశాలన్నీ ఒక్కతాటిపై వచ్చి తమ శక్తియుక్తులను ఏకం చేయాలన్న జిన్‌పింగ్.. ప్రపంచం మాంద్యంలోకి జారిపోకుండా ఆర్థిక విధానాలను సంయుక్తంగా అమలు చేయాలన్నారు. పన్నులను తగ్గించి వాణిజ్యానికి ఎదురవుతున్న అడ్డుగోడలను తొలగించాలని దేశాలకు పిలుపునిచ్చారు.
డూ ఆర్ డై పోరాటం..
కరోనాపై జీ- 20 దేశాలది డూ ఆర్ డై పోరాటమన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాణిజ్యంపై ఆంక్షలను సడలించాలని కోరారు. అంతర్జాతీయ ద్రవ నిధి కింద వడ్డీ లేని రుణాలను అందించే ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు. మందులు, ఆహారం, వైద్య పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సరఫరా చేసే ఆంక్షలు లేని గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేయడం ముఖ్యమన్నారు.
కరోనాపై పోరాడేందుకు యుద్ధ ప్రణాళిక అవసరమని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ సూచించారు. సమష్టి చర్యలు లేకుండా వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేమన్న ఆయన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వ్యాప్తి చెందకుండా చూడాలని సూచించారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరాడలేక కేంద్ర ఆరోగ్య మంత్రి రాజీనామా