చైనాలోని వుహాన్ నగరం కొద్ది రోజులుగా కరోనా వైరస్‌తో స్తంభించిపోయింది. ప్రస్తుతం అక్కడ వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. ప్రముఖ కంపెనీలు తెరుచుకోనున్నట్టు ప్రకటించింది ప్రభుత్వం. వైరస్‌పై పోరులో వుహాన్ విజయం సాధిస్తోందని ప్రపంచానికి తెలియజేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రధానంగా నిత్యవసర ఉత్పత్తులు, వైరస్ కట్టడి సామగ్రి, ప్రజావసరాల సంస్థల వంటివి వెంటనే తెరుచుకోనున్నట్లు వెల్లడించింది హుబే రాష్ట్ర ప్రభుత్వం. వుహాన్ నగరం అంతర్జాతీయ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఈనెల 20 తర్వాత మరిన్ని సంస్థలు ఉత్పత్తి ప్రారంభిస్తాయని తెలిపారు అధికారులు.
మంగళవారం.. వైరస్ కేంద్రబిందువైన వుహాన్‌లో చైనా అధ్యక్షుడు తొలిసారి పర్యటించారు. ఆ మరుసటి రోజేే ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
కొద్ది వారాలుగా వుహాన్‌లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. హుబే రాష్ట్రంలోని ఇతర నగరాల్లో కొద్ది రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో..
వుహాన్ మినహా.. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో విమానం, రైళ్లు, ఓడలు, సిటీ బస్సుల సర్వీసులు తిరిగి ప్రారంభంకానున్నాయి. హుబే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కఠిన నియంత్రణ చర్యలను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు అధికారులు. వైరస్ కేసుతో ఎలాంటి సంబంధం లేనివారికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అయితే పాఠశాలలు మాత్రం.. మూతపడే ఉంటాయని చెప్పారు.
వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలో ఇప్పటివరకు 3,100మందికి పైగా ప్రాణాలు కొల్పోయారు. సుమారు 81వేల వైరస్ కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి: కరోనాను గుర్తించేందుకు ఆ 5 రోజులు చాలు!