అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల(Taliban News) అరాచక పాలన రోజురోజుకు పెచ్చుమీరుతోంది. తమ హక్కుల కోసం నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై వారు ఉక్కుపాదం మోపుతున్నారు. గురువారం కాబుల్‌లో బాలికల కోసం పాఠశాలలు(Girl Education In Afghanistan) పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ, కొంతమంది మహిళలు నిరసన చేపట్టారు. అయితే.. ఈ నిరసనను తాలిబన్లు హింసాత్మకంగా మార్చారు. నిరసన చేస్తున్న మహిళలు సహా విలేకరులపై దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు స్థానిక మీడియా తెలిపింది.
శాంతియుతంగానే కొనసాగుతున్నా..
కాబుల్‌లోని విద్యా శాఖ కార్యాలయం ఎదుట మహిళలు నిరనస చేపట్టారు. విద్యాశాఖ కార్యాలయం నుంచి ఆర్థిక శాఖ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టేందుకు తొలుత తాలిబన్లు వారిని అనుమతించారు. ఈ ర్యాలీ శాంతియుతంగానే కొనసాగుతున్నప్పటికీ.. తాలిబన్లు రెచ్చిపోయారు. మహిళలపై, జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారని 'ఖామా ప్రెస్' తెలిపింది. ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. ఓ విదేశీ పౌరుడు, ఇద్దరు స్థానిక జర్నలిస్టులను తాలిబన్ పోలీసులు కొట్టారని చెప్పింది.
'మాకు ఏమైనా పర్లేదు'
విద్యను రాజకీయం చేయవద్దని తాలిబన్లను మహిళలు కోరారని సదరు మీడియా తన కథనంలో తెలిపింది. అఫ్గాన్‌లో బాలికల కోసం పాఠశాలలు పునఃప్రారంభించి, మహిళలకు పనిచేసే హక్కును కల్పించాలని డిమాండ్ చేసినట్లు చెప్పింది. "మాకు ఏమైనా పర్లేదు. ఎందుకంటే మా వల్ల భవిష్యత్ తరాలకు ప్రాథమిక హక్కులైన విద్య, పని హక్కులు దొరుకుతాయి" అని నిరసనకారులు చెప్పారని పేర్కొంది. అయితే.. ఈ ఘటనపై తాలిబన్ ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.
అఫ్గాన్‌లో అధికారం చేపట్టిన తాలిబన్లు... మహిళలకు సెకండరీ విద్యకు అనుమతించటం లేదు. అయితే.. తగిన కార్యాచరణ రూపొందించిన తర్వాత.. తాము అమ్మాయిలు చదువుకునేందుకు పాఠశాలలు పునఃప్రారంభిస్తామని యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్(యూనిసెఫ్)తో.. ఇటీవలే తాలిబన్ ప్రభుత్వంలోని తాత్కాలిక విద్యా శాఖ మంత్రి తెలిపారు.
ఇవీ చూడండి: