సాంకేతికతను తప్పుడు మార్గంలో ఉపయోగించి ప్రజలకు ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నిస్తోంది ఉత్తర కొరియా. ఆ దేశానికి చెందిన పలువురు హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలే లక్ష్యంగా సైబర్ దాడులకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ప్రపంచ దేశాలను హెచ్చరించింది అమెరికా. ఇలా సేకరించిన నిధులను తమ దేశ అణుపరిశోధనల కోసం ఉపయోగించాలని కిమ్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిపింది.
36 దేశాల్లో దాడులకు ప్రయత్నాలు..
ఉత్తర కొరియా హ్యాకింగ్ బృందం.. 36 దేశాల్లోని ఏటీఎంల నుంచి 2 బిలియన్ల డాలర్ల మొత్తాన్ని దొంగిలించేందుకు ప్రయత్నాలు చేసినట్లు చెప్పింది అమెరికా. నకిలీ ఈ-మొయిళ్లను పంపి వాటి ద్వారా ఫిషింగ్ దాడులకు ప్రయత్నించినట్లు స్ఫష్టం చేసింది.
"ఫిబ్రవరి నుంచి ఉత్తర కొరియా బ్యాంక్‌లను లక్ష్యంగా చేసుకుంది. పలు దేశాల్లోని ఏటీఎంల నుంచి డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేసింది" అని సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజన్సీ(సీఐఎస్ఏ), ట్రెజరీ డిపార్ట్మెంట్, ఫెడరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ), యూఎస్ సైబర్ కమాండ్ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
హానికరమైన మాల్వేర్ సాయంతో బ్యాంక్ సర్వర్లు, ఆర్థిక సంస్థలను యాక్సెస్ చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నాలు చేసినట్లు ఆయా సంస్థలు తెలిపాయి. 'ఫాస్ట్క్యాష్ 2.0 నార్త్‌కొరియా బాగ్లేబాయ్స్ రాబింగ్ బ్యాంక్స్' పేరిట ఓ స్క్రీమ్ను సైబర్ నేరగాళ్లు ప్రవేశపెట్టారని.. దాని సాయంతో విభిన్న దేశాల్లో సైబర్ దాడులకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్లు, ఏటీఎంలలో క్యాష్ లేకుండా చేసేందుకు ఈ స్కీమ్ తయారుచేసినట్లు తెలిపారు.