భారత్-అమెరికా సంబంధాలు రాజకీయ పార్టీలకు అతీతమైనవిగా అమెరికా విదేశాంగ ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ అభివర్ణించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలిచనా.. ఆ సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రెండు దేశాల రక్షణ, విదేశాంగ మంత్రుల సమావేశం ముగిసిన అనంతరం మాట్లాడిన ఆమె.. చైనాపై విమర్శలు గుప్పించారు. డ్రాగన్ సృష్టించిన కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయన్నారు. వైరస్ పుట్టుకపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలన్నారు. నిజ నిర్ధరణకు శాస్త్రవేత్తలు, వైద్యులను చైనాలోకి అనుమతించాలని చెప్పారు.
ప్రపంచ యవనికపై భారత్ కీలకమైన శక్తిగా అభివర్ణించిన మోర్గాన్.. అంతర్జాతీయ సవాళ్లను భారత్‌తో కలిసి ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
“ప్రపంచంలో కీలకమైన శక్తిగా భారత్ ఎదగడాన్ని స్వాగతిస్తున్నాం. అంతర్జాతీయంగా అమెరికా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వాటిని అమెరికా ఒంటరిగా పరిష్కరించ లేదు. సవాళ్లను ఎదుర్కోవడంలో అమెరికాకు భారత్ భాగస్వామ్యం కావాలి.”
- మోర్గాన్ ఓర్టగస్, అమెరికా విదేశాంగ ప్రతినిధి
ఇదీ చదవండి- ఆర్మేనియాపై అజర్బైజాన్ వాయుదాడులు!