కరోనా కేసుల్లో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది అమెరికా. రోజురోజుకు అక్కడ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 99 శాతం వైరస్ కేసులు ప్రమాదరకమైనవి కాదన్నారు. ట్రంప్ వ్యాఖ్యలపై అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) కమిషనర్ డా. స్టీఫెన్ హాన్ మండిపడ్డారు. వైరస్ ఎంత హానికరమో ప్రభుత్వ వివరాలే రుజువు చేస్తున్నాయన్నారు.
'ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అని తెలుసుకోవడం లేదు. కరోనా ఎంత తీవ్రమైన సమస్య అని ప్రభుత్వ డేటాయే రుజువు చేస్తోంది. ఏదేమైనా ఈ పరిస్థితి విషాదకరమైంది. పెరుగుతున్న కేసులను తగ్గించాలంటే ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు తప్పక పాటించాలి. మాస్క్లు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి.' అని డాక్టర్ స్టీఫెన్ హాన్ తెలిపారు.
99శాతం ప్రమాదకరం కాదు
'అమెరికా ఎక్కువ పరీక్షలు చేస్తోంది. అందువల్ల అధిక సంఖ్యలో వైరస్ కేసులు బయటపడుతున్నాయి. అయితే ఇందులో 99శాతం ప్రమాదకరమైనవి కావు.' అని ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించారు.
ట్రంప్ మాటలను ఖండించారు టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ మేయర్ స్టీవ్ అడ్లెర్. ట్రంప్ వ్యాఖ్యలే చాలా ప్రమాదకరమైనవని విమర్శించారు.
20శాతం మందిలో తీవ్రంగా వ్యాధి లక్షణాలు
కరోనా సోకిన 20 శాతం మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. అందులో న్యుమోనియా, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారని తెలిపింది. స్వల్ప లక్షణాలు లేదా లక్షణాలు కనిపించని వారి వల్లే వైరస్ అధికంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది.
ఇదీ చూడండి: చీలిక దిశగా నేపాల్ అధికార పార్టీ!