ఇటు హీరోగా అటు నిర్మాతగా దూసుకెళ్తున్నారు టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన సినిమాలు విడుదలయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యలో.. చిరు తమ్ముడి పాత్రలో అధ్భుతంగా నటించారు ఈ మాస్ హీరో. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ 'రావణాసుర'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ ముందు అంతగా రాణించలేకపోయింది. ప్రస్తుతం రవితేజ.. దర్శకుడు మహేశ్‌తో 'టైగర్ నాగేశ్వరరావు' అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల చేసేందుకు మూవీ టీమ్ సన్నాహాలు చేస్తోంది. అయితే, తాజాగా ఈ మాస్ మహారాజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో టాక్ నడుస్తోంది.
'జాతిరత్నాలు' సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన యువ దర్శకుడు అనుదీప్ కేవీ, రవితేజ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందట. అనుదీప్ దర్శకత్వంలో రవితేజ టైమింగ్‌తో ఓ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మొదటి సినిమాతోనే సాలిడ్ హిట్ ఇచ్చిన అనుదీప్.. కామెడీ అద్భుతంగా పండించగల రవితేజను ఎలా చూపించబోతున్నారన్న ప్రేక్షకుల్లో ఆసక్తిగా మారింది. ఈ కామెడీ కాంబో వర్కవుట్ అయితే బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్ట్ కొట్టడం ఖాయమని అంటున్నారు అభిమానులు. అయితే, ఈ వార్తలపై అటు రవితేజ గాని.. అనుదీప్ గాని స్పందించలేదు.
నిర్మాతగా మాస్ మహారాజ..
హీరోగానే కాకుండా నిర్మాతగానూ రవితేజ దూసుకెళ్తున్నారు. ఈ ప్రోడ్యూస్ చేసిన కొత్త సినిమా 'చాంగురే బాంగారు రాజా' ఈ ఏడాది జూలై 11న విడుదల కానుంది. అంతకుముందు, ఐశ్వర్య లక్ష్మి, విష్ణు విశాల్ నాయకానాయికలుగా తెరకెక్కిన గట్ట కుస్తీ (మట్టి కుస్తీ)ని విష్ణు విశాల్‌తో కలసి సంయుక్తంగా నిర్మించారు.
బాలీవుడ్లో మాస్ మహారాజ ఎంట్రీ!
రవితేజ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన వరుణ్ ధావన్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నారని సమాచారం. ఇది తమిళంలో విజయవంతమైన 'మానాడు'కు హిందీ రీమేక్‌గా ఉంటుందని తెలుస్తోంది. హీరో రానా, కరణ్ జోహార్, ఏషియన్ సునీల్ దీన్ని సంయుక్తంగా నిర్మించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకుడిగా వ్యవహరించనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.