Poonam Kaur Disease: ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ అనార్యోగానికి గురైంది. ఫైబ్రోమైయాల్జీయా వ్యాధితో ఆమె బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధరించారు. నిద్రలేమి, కండరాల నొప్పులు, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మ సంబంధిత సమస్యలు ఫైబ్రోమైయాల్జీయా వ్యాధి లక్షణాలు. పూనమ్ కౌర్‌కు ఈ వ్యాధి ఉన్నట్లు నవంబర్ 18న నిర్ధరణ అయ్యింది.
ఇటీవల ఆమె కేరళలోని ఓ ఆయుర్వేద ఆస్పత్రిలో చికిత్స తీసుకుందని సమాచారం. ప్రస్తుతం పుణెలోని తన సోదరి నివాసంలో విశ్రాంతి తీసుకుంటోంది. అయితే పూనమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.
పూనమ్ కౌర్ సంవత్సరం నుంచి చేనేత కార్మికుల కోసం పోరాడుతోంది. చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 'జీరో జీఎస్టీ' పేరుతో సంతకాలు సేకరిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు చేనేత ఉద్యమకారుడు వెంకన్న నేతతో కలిసి కృషి చేస్తోంది.
2006లో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'మాయాజాలం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన పూనమ్.. తెలుగు, తమిళ, మలయాళంలో దాదాపు 35కుపైగా చిత్రాల్లో నటించింది.