సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వరుస విషాదాలు జరుగుతున్నాయి. ప్రముఖ మలయాళ నటుడు ఇన్నోసెంట్(75) తుదిశ్వాస విడిచారు. మార్చి 3వ తేదీ నుంచి కేరళ.. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆదివారం రాత్రి 10.30 గంటలకు కన్నుమూశారు. కరోనా ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు, వివిధ అవయవాల వైఫల్యం వల్ల ఇన్నోసెంట్ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి.
దివంగత నటుడు ఇన్నోసెంట్.. 2014-2019 వరకు లోక్‌సభ ఎంపీగా కూడా సేవలందించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇన్నోసెంట్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ఇన్నోసెంట్‌కు 2012లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధరణ అయింది. మూడేళ్ల తర్వాత.. ఆయన ఆ వ్యాధిని 2015లో అధిగమించానని ప్రకటించారు. అలాగే.. క్యాన్సర్‌తో తన యుద్ధం గురించి తన పుస్తకం 'లాఫ్టర్ ఇన్ ది క్యాన్సర్ వార్డ్'లో రాశారు.
మలయాళ నటుడు, లోక్‌సభ మాజీ ఎంపీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. "ఇన్నోసెంట్ తన ప్రత్యేకమైన నటనా శైలితో ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలను తెలుసుకున్నారు" అని సీఎం విజయన్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఇన్నోసెంట్ మృతికి సంతాపం తెలిపారు. ఆయన అద్భుతమైన, ప్రతిభావంతుడైన నటుడని కొనియాడారు. "యాక్టర్, హాస్యనటుడు, కేరళ మాజీ ఎంపీ ఇన్నోసెంట్ 75 ఏళ్ల వయసులో కన్నుమూసినందుకు సంతాపం తెలియజేస్తున్నాను. అద్భుతమైన, ప్రతిభావంతుడైన నటుడే కాకుండా ఆయన చాలా మంచి మనిషి. ఓం శాంతి" అని థరూర్ ట్వీట్ చేశారు.
ఇన్నోసెంట్.. మొదట నిర్మాతగా చిత్రసీమలోకి ప్రవేశించారు. ఆ తర్వాత 1972లో కమెడియన్గా తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన చివరగా.. ప్రముఖ దర్శకుడు సత్యన్ అంతికాడ్ కుమారుడ్ అనూప్ సత్యన్ తెరకెక్కించిన 'పచువుమ్ అత్బుతవిలక్కుమ్' సినిమాలో నటించారు. ఆయన నటించిన పృథ్వీరాజ్ 'కడువ' చిత్రం ఇటీవలే విడుదలైంది. అయితే ఇన్నోసెంట్ కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ వర్క్ చేశారు. మరికొన్ని చిత్రాల్లో పాటలు కూడా పాడారు.
నటనతో పాటు రాజకీయాల్లోనూ ఇన్నోసెంట్ చాలా చురుగ్గా ఉండేవారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో.. ఇన్నోసెంట్ త్రిసూర్ జిల్లాలోని చలకుడి నియోజకవర్గం నుంచి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థి బెన్నీ బెహనాన్ చేతిలో ఓడిపోయారు.