Actor Krishnam Raju Dead : ప్రముఖ నటుడు 'రెబల్ స్టార్' కృష్ణంరాజు(83) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. రెబల్ స్టార్ మృతి.. సినీ రంగానికి తీరని లోటని కృష్ణంరాజు ఫ్యాన్స్ గౌరవ సలహాదారుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్త్రి అన్నారు.
కృష్ణంరాజు మృతికి కారణమిదే..
కృష్ణంరాజు మృతికి గల కారణాన్ని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ప్రకటన విడుదల చేశాయి. "కృష్ణంరాజు మధుమేహం, పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారు. గుండె కొట్టుకునే వేగంతో చాలా కాలంగా సమస్య ఉంది. రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల గతేడాది ఆయన కాలికి శస్త్రచికిత్స జరిగింది. దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతోనూ కృష్ణంరాజు బాధపడుతున్నారు. పోస్ట్ కోవిడ్ సమస్యతో గత నెల 5వ తేదీన ఆస్పత్రిలో చేరారు. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో తీవ్ర నిమోనియా ఉన్నట్టు గుర్తించాం. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడం వల్ల ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ తగిన వైద్యం చేశాం. ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడం వల్ల కృష్ణంరాజు కన్నుమూశారు" అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు.. తెలుగు చిత్రసీమలో రెబల్ స్టార్‌గా పేరొందారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన విలన్‌గానూ అలరించారు. అయితే చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా కూడా ఆయన పనిచేశారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పని చేశారు కృష్ణంరాజు. ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ప్రయాణించిన ఆయన మరణంతో చిత్రసీమ విషాదంలో మునిగిపోయింది.
ఎన్టీఆర్, అక్కినేని తర్వాత..
తెలుగు సినీరంగంలో ఎన్టీఆర్, అక్కినేని తర్వాత రెండో తరం వచ్చిన హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. శోభన్‌బాబు, కృష్ణ వెండితెరకు పరిచయం అయినా కొన్నాళ్లకే 1966లో వచ్చిన 'చిలకా గోరింక' చిత్రంతో కృష్ణంరాజు.. వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. అయితే తొలిచిత్రం ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో చాలా నిరాశ పడ్డారు. ఫ్లాప్‌తో ఆయనకు ఏమీ సంబంధం లేదని మిత్రులు, దర్శక నిర్మాతలు సర్దిచెప్పినా ఆయన సమాధాన పడలేదు. నటనను మెరుగుపరచుకునేందుకు తనకు తానే శిక్ష విధించుకున్నారు.
నటనలో రాటు దేలేందుకు అనే పుస్తకాలు చదివి..
నటనలో రాటు దేలేందుకు ప్రముఖులు రాసిన పుస్తకాలు చదివారు. పాతకాలం నటుడు సీహెచ్ నారాయణరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. నటనలో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవరకు ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. ఇది ఆయనలోని నిబద్ధతను పరిశ్రమకు చాటింది. తర్వాత డొండీ నిర్మాణ సారథ్యంలో.. అవేకళ్లు చిత్రంలో విలన్‌గా అలరించారు. ఆ చిత్రంలో విలన్ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుంచీ కూడా ప్రశంసలు అందుకున్నారు. అప్పటికే ప్రఖ్యాత విలన్ ఆర్ నాగేశ్వరరావు చనిపోవడంతో అంతా ఆయన్ను మరో ఆర్ నాగేశ్వరరావు తెలుగు తెరకు వచ్చారన్నారు.
ఎన్నో అవార్డులు
కృష్ణంరాజు విలక్షణమైన నటనా శైలి కారణంగా ఆయన్ను ఎన్నో అవార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1977లో అమరదీపం చిత్రానికి, 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రంలో ఆయన ప్రదర్శించిన నట విశ్వరూపానికి నంది అవార్డులతో సత్కరించింది. 1986లో తాండ్రపాపారాయుడు చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న కృష్ణంరాజు.. 2006లో ఫిల్మ్‌ఫేర్ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారాన్ని తీసుకున్నారు.