5G Spectrum Auction: దేశంలో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు మరో కీలక ముందడుగు పడింది. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. జులై చివరి నాటికి 72,097.85 మెగా హెడ్జ్‌ల స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నట్లు బుధవారం అధికారిక ప్రకటన విడుదలైంది. ''5జీ సేవలు అందించే స్పెక్ట్రమ్ వేలం కోసం టెలికమ్యూనికేషన్ విభాగం చేసిన ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తం 72,097.85 మెగా హెడ్జ్‌ల రేడియో వేవ్‌లను 20 ఏళ్ల కాల వ్యవధితో వేలం వేయనున్నారు. ఇందులో తక్కువ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మధ్య స్థాయి (3300 MHz), అత్యధిక (26 GHz) ఫ్రీక్వెన్సీ బాండ్లకు స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు. టెలికాం రంగంలో సంస్కరణలతో ఈ వ్యాపారాన్ని సులభతరం చేసేందుకు గానూ.. స్పెక్ట్రమ్ వేలంలో కేబినెట్ పలు ఆప్షన్లను తీసుకొచ్చింది.
టెలికాం వేలంలో తొలిసారిగా ముందస్తు చెల్లింపుల నిబంధనను ఎత్తేసింది. అంటే.. ''వేలంలో విజేతగా నిలిచిన బిడ్డర్లు.. ముందస్తుగా ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ధరను 20 సమాన వాయిదాల్లో కట్టాలి. అయితే ప్రతి వాయిదాను సంవత్సరం ఆరంభంలోనే చెల్లించాలి'' అని అధికారిక ప్రకటనలో వెల్లడించారు. ఇక, బిడ్డరు 10 ఏళ్ల తర్వాత స్పెక్ట్రమ్‌ను తిరిగి ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తున్నారు. అప్పుడు బ్యాలెన్స్ ఇన్‌స్టాల్‌మెంట్లను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వేలం ధర ఎంతన్నది మాత్రం ప్రస్తుతానికి వెల్లడించలేదు.
5జీ స్పెక్ట్రమ్‌పై ప్రభుత్వం ప్రతిపాదించిన ధరలు అధికంగా ఉన్నాయంటూ టెలికాం సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అందుబాటు ధరల్లోనే స్పెక్ట్రమ్‌ను తీసుకొచ్చేందుకు టెలికాం విభాగం కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ఇప్పుడు 4జీలో వస్తున్న డౌన్‌లోడ్ స్పీడ్ కంటే 10 రెట్ల వేగంతో ఇంటర్నెట్ సేవలను పొందే వీలుంటుంది.
ఇవీ చూడండి: దరి చేరనున్న 5జీ సాంకేతికత- అధిగమించాల్సిన సవాళ్లెన్నో..
ఈ దశాబ్దం చివరి నాటికి '6జీ' సేవలు: ప్రధాని మోదీ
రూ.20వేలలో 5జీ ఫోన్ కొనాలా? ఈ టాప్ 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!