దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టీసీఎస్ భారీగా లాభాలను పెంచుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసికం ఫలితాలను ఆ సంస్థ ప్రకటించింది. క్యూ4లో రూ.11,392 కోట్ల నికర లాభం నమోదైందని సంస్థ తెలిపింది. ఇది 14.8 శాతం పెరుగుదల అని వివరించింది. 2021-21 నాలుగో ఆర్థిక సంవత్సరంలో నికర లాభం రూ.9,926కోట్లుగా ఉందని గుర్తు చేసింది. 2023 మార్చి త్రైమాసికంలో ఆదాయం 16.9 శాతం పెరిగి రూ.59,162కు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. 2022 మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.50,591గా ఉందని పేర్కొంది. వార్షిక ఆదాయం రూ.2,25,458 కోట్లుగా నమోదైందని కంపెనీ వివరించింది. ఆదాయంలో 17.6 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. నికర లాభం రూ.42,147 కోట్లు అని టీసీఎస్ పేర్కొంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 10 శాతం అధికమని పేర్కొంది.
- ఆపరేటింగ్ మార్జిన్లు 2022 (24.1 శాతం)తో పోలిస్తే 2023 ఆర్థిక సంవత్సరం (24.5 శాతం)లో కాస్త పెరిగాయి.
- నెట్ మార్జిన్లు 2022 చివరి త్రైమాసికంలో 18.7 శాతం ఉండగా.. 2023 మార్చి త్రైమాసికంలో 19.3 శాతానికి పెరిగాయి.
- కంపెనీ వద్ద రూ.41,440 కోట్ల క్యాష్ ఫ్లో ఉందని టీసీఎస్ పేర్కొంది. ఇది నికర లాభంలో 104.1 శాతం అని గుర్తు చేసింది.
- ఫలితాల సందర్భంగా డివిడెండ్‌పైనా ప్రకటన చేసింది టీసీఎస్. ఒక్కో షేరుపై రూ.24 డివిడెండ్‌గా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. మొత్తంగా రూ.45,602 కోట్లు షేర్ హోల్డర్లకు చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది.
- నాలుగో త్రైమాసికంలో 821 మంది ఉద్యోగులను కొత్తగా చేర్చుకున్నట్లు తెలిపింది. ఆ ఏడాది నికరంగా 22,600 మందిని చేర్చుకున్నట్లు వెల్లడించింది.
- టీసీఎస్ సీఈఓ, ఎండీగా కే కృతివాసన్ జూన్ 1 నుంచి బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ వెల్లడించింది.
ద్రవ్యోల్బణం డౌన్
మరోవైపు, దేశంలో చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 15 నెలల కనిష్ఠానికి చేరింది. ఫిబ్రవరిలో 6.44 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం.. మార్చిలో 5.66 శాతానికి పరిమితమైంది. ఆర్బీఐ నిర్దేశించిన జోన్ అయిన 6 శాతం కంటే తక్కువగానే ద్రవ్యోల్బణం నమోదు కావడం గమనార్హం. ఆహార పదార్థాల ధరల్లో తగ్గుదలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జాతీయ గణాంక కార్యాలయం డేటా ప్రకారం మార్చిలో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 4.79 శాతంగా ఉంది. ఇది గత ఏడాది మార్చిలో 7.68 శాతంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.95 శాతంగా ఉంది. 2022 డిసెంబర్‌లో 5.7 శాతంగా ఉన్న రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో 6.4 శాతంగా నమోదైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి CPI ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉంటుందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.