Stock Market Tutorial: స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే యువతకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) చక్కని అవకాశం కల్పిస్తోంది. ఎన్‌ఎస్‌ఈ తన నాలెడ్జ్ హబ్ ద్వారా మార్కెట్ గురించి ఎవరైనా సరే కనీస పరిజ్ఞానం సంపాదించేలా కొన్ని కోర్సులు ప్రవేశపెట్టింది. ఆర్థిక వ్యవహారాల గురించి యువతరానికి విశ్వసనీయమైన సమాచారం అందించాలనే ఉద్దేశంతో రెండేళ్ల క్రితం ఎన్‌ఎస్‌ఈ ఈ హబ్‌ను ప్రారంభించింది. ఇది ఒక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత లెర్నింగ్ ప్లాట్‌ఫాం. ఇందులో చేరడం ద్వారా యువతీయువకులు మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. దేశవిదేశాల్లోని నిపుణుల నుంచి పాఠాలు నేర్చుకుని, తద్వారా తమ ఆర్థిక నైపుణ్యాలకు మెరుగులద్దుకోవచ్చు.
ఏఏ అంశాలుంటాయి?: క్యాపిటల్ మార్కెట్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్ అండ్ ఎకానమీ మీద పూర్తి అవగాహన కల్పించేలా ఈ కోర్సులు ఉంటాయి. అల్గారిథమ్ ట్రేడింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్, వెల్త్ మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్, సెక్యూరిటీస్ మార్కెట్, ఈక్విటీ ఆప్షన్స్, కమొడిటీస్, ట్యాక్సేషన్, ఇతర ఆర్థిక అంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవచ్చు. ఈ పాఠాల్లో చాలావరకూ ఉచితంగా చదువుకోవచ్చు. కొన్నింటికి మాత్రం కొంత ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఏఐసీటీఈ, ఆల్ఫాబీటా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లెట్స్ వెంచర్, సీఐఎంఏ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. వీటి ద్వారా వివిధ అంశాలు నేర్చుకోవడంతోపాటు, ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి నేరుగా సందేహాలు కూడా తీర్చుకోవచ్చు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: https://www.nseindia.com/learn/nse-knowledge-hub
ఇదీ చదవండి: సూచీ ఫండ్లలో పెట్టుబడి.. లాభమా ? నష్టమా?