Government Advises Never To Dial *401# Code : టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొలదీ ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ సైబర్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగాలు ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. కానీ సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త ఎత్తుగడలతో, ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ మోసాలను అరికట్టాలంటే, మనం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం.
నమ్మించి మోసం చేస్తారు!
సాంకేతికత పెరిగిన తరువాత, మన పనులన్నీ ఆన్లైన్లోనే సులువుగా జరిగిపోతున్నాయి. బ్యాంకింగ్, షాపింగ్, మెసేజింగ్ అన్నీ ఆన్లైన్లోనే చేసేస్తున్నారు. దీనితో వీరిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎవరికీ అనుమానం రాకుండా కొత్త రకం మోసానికి తెరతీశారు. వీరు వినియోగదారులను ఎలా మోసం చేస్తారో ఇప్పుడు చూద్దాం.
సైబర్ నేరగాళ్లు ముందుగా మీకు ఫోన్ చేస్తారు. తాము కస్టమర్ కేర్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెబుతారు. లేదా మీ టెలికాం ఆపరేటర్ టెక్నికల్ సపోర్ట్ టీమ్ వాళ్లమని చెప్పి, మిమ్మల్ని నమ్మిస్తారు.
మీ సిమ్ కార్డులో ఒక సమస్య ఉందని, దానిని క్లియర్ చేయాలని చెబుతారు. లేదా నెట్వర్క ప్రోబ్లమ్ అని లేదా సర్వీస్ క్వాలిటీని చెక్ చేస్తున్నామని మిమ్మల్ని నమ్మిస్తారు. ప్రోబ్లమ్ను సాల్వ్ చేయాలంటే, మీ ఫోన్ నుంచి తాము చెప్పిన నంబర్‌కు కాల్ చేయమని చెబుతారు. అయితే దానికి ముందు *401# కోడ్‌ను ఉపయోగించాలని సూచిస్తారు. మీరు పొరపాటున ఈ కోడ్ ఉపయోగించి సదరు నంబర్‌కు డయల్ చేశారో, ఇక మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు అంతా ఖాళీ అయిపోతుంది.
ఎలా అంటే?
మీరు మీ ఫోన్లో *401# కోడ్‌ను ఉపయోగించి, మీకు తెలియని ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తే, ఇక అప్పటి నుంచి మీకు వచ్చే కాల్స్, ఓటీపీలు అన్నీ సదరు నంబర్‌కు (ఫార్వర్డ్ అవుతాయి) వెళ్లిపోతాయి. సైబర్ నేరగాళ్లు వాటిని ఉపయోగించి, మీ బ్యాంక్ ఖాతాలోని డబ్బు మొత్తాన్ని దోచుకుంటారు.
ఆన్లైన్ షాపింగ్ చేశారా?
నేడు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. కస్టమర్‌కు నేరుగా ఫోన్ చేసి, మీకు డెలివరీ వచ్చిందని చెబుతారు. మీ ప్యాకేజీని డెలివరీ బాయ్ ఇస్తాడని, అతనిని కాంటాక్ట్ చేయాలంటే, ముందుగా *401#కోడ్‌ను ఎంటర్ చేసి, తరువాత అతని ఫోన్ నంబర్ ఎంటర్ చేయాలని చెబుతారు. పొరపాటున మీరు సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు చేస్తే, ఇక అంతే సంగతులు. మీ బ్యాంకు ఖాతా మొత్తం ఖాళీ అవుతుంది.
అప్రమత్తంగా ఉండాలి
నేడు ఇలాంటి సైబర్ మోసాలు చాలానే జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి, వారు చెప్పిన నంబర్‌కు కాల్ చేయమని అడిగితే, వెంటనే దానిని తిరస్కరించండి. పార్సిల్స్ విషయంలో డెలివరీ బాయ్స్ మీకు కాల్ చేస్తారు. మిమ్మల్ని తిరిగి కాల్ చేయమని వారు అడగరు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
బెస్ట్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఎంచుకోవాలా? టాప్-7 టిప్స్ మీ కోసమే!