How to Save Income Tax in Telugu : దేశంలో నిర్దేశిత పరిమితికి మించి ఆదాయం కలిగిన వారంతా ప్రతి ఏటా ప్రభుత్వానికి తప్పకుండా ఆదాయ పన్ను చెల్లించాలి. ఆ పన్ను వ్యక్తిగతమైనా లేదా కార్పొరేట్ ఆదాయమైనా ప్రభుత్వ చట్టాల ప్రకారం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఆదాయపన్ను చట్టం 1961లో పన్ను మినహాయింపులకు సంబంధించి కొన్ని మార్గాలు ఉన్నాయి. చాలా మందికి ఈ ట్యాక్స్(Income Tax) సేవింగ్ పద్ధతులపై సరైన అవగాహన ఉండదు. ఈ క్రమంలో వారు కొంతమేర నష్టపోతుంటారు. అలాంటి వారి కోసం చట్టబద్ధంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ కింద పన్ను మినహాయింపు పొందే కొన్ని ట్యాక్స్ పే మార్గాలు తీసుకొచ్చాం. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
ఈ సెక్షన్స్ కింద పన్ను మినహాయింపు : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొన్ని మినహాయింపులు ఇస్తోంది. అందులో సెక్షన్ 80C.. ఓ ప్రత్యేకమైన దానిగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా నిర్దిష్ట పెట్టుబడులు, ఖర్చులకు సంబంధించి పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ సెక్షన్‌తో పాటు 80సీసీసీ, 80సీసీడీ కింద ట్యాక్స్ మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఈ సెక్షన్స్ ద్వారా కేటాయించిన ప్రత్యేక మార్గాల్లో ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా ట్యాక్స్ పే చేసేవారు లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు పొందే ఛాన్స్ ఉంది.
గృహ రుణాలు : ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 24 కింద పన్ను చెల్లింపుదారులు హౌమ్ లోన్స్‌పై మినహాయింపు పొందవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ పే చేసేవారు ఇంటి రుణాలపై రూ. 2 లక్షల వరకు పన్ను తగ్గింపు పొందే మార్గాలున్నాయి.
ఎడ్యుకేషన్ లోన్ : ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లోని సెక్షన్ 80E కింద పన్ను చెల్లింపుదారులు విద్యా రుణంపై తగ్గింపు పొందొచ్చు. అయితే దీనికి సంబంధించి గరిష్ఠంగా ఇంత వరకు పన్ను మినహాయింపు అనేది ఏమీ లేదు.
మెడికల్ వ్యయాలు : ఐటీ శాఖ.. సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపులను అందిస్తోంది. దీని ప్రకారం మంత్లీ ఇన్కమ్ పొందే ఉద్యోగులు మెడికల్ ఇన్సూరెన్స్‌లపై రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు ట్యాక్స్ తగ్గింపు పొందవచ్చు. ఈ సెక్షన్ కింద పన్ను చెల్లింపు దారుడు తనపై ఆధారపడిన భార్య, పిల్లలు, సీనియర్ సిటిజన్లపై చేసే మెడికల్ వ్యయాలపై పన్ను మినహాయింపు పొందే వెసులుబాటును కేంద్రం కల్పిస్తోంది.
'పన్ను' ఆదా చేద్దామనుకుంటున్నారా?.. ఈ పొరపాట్లు చేయొద్దు!
మ్యూచువల్ ఫండ్లు, షేర్లు : ట్యాక్స్ పే చేసేవారు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీసీజీ కింద మ్యూచువల్ ఫండ్లు, షేర్లపై మినహాయింపు పొందొచ్చు. సంవత్సరానికి 12లక్షల రూపాయల కంటే తక్కువ సంపాదించే వారికి ఈ తగ్గింపు లభిస్తుంది. ప్రత్యేక షేర్లు, రాజీవ్ గాంధీ ఈక్విటీ పథకం కింద మ్యూచవల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వారు డిడక్షన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. అలాగే చెల్లింపుదారులు వారికి కేటాయించిన ప్రత్యేక మార్గాల్లో లాభాలను మళ్లీ పెట్టుబడుల పెట్టడం ద్వారా ట్యాక్స్‌లను కొంతమేర తగ్గించుకోవచ్చు.
ఇంటి అద్దె భత్యంపై మినహాయింపు : ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 80జీజీ కింద ఉద్యోగస్తులు హౌస్ రెంట్ అలవెన్స్‌ని పొందవచ్చు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయేమిటంటే.. ఉద్యోగులు తాము చెల్లించే వార్షిక ఇంటి అద్దె రూ. 1లక్ష దాటితే మాత్రమే ప్రయోజనం పొందవచ్చు. అదే విధంగా యజమాని పాన్ కార్డు, లీజు అగ్రిమెంట్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
విరాళాలపై తగ్గింపు : స్వచ్చంధ సంస్థలకు ఇచ్చిన విరాళాలపై చెల్లింపుదారులు సెక్షన్ 80జీ, 80జీజీసీ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాలపై తగ్గింపు వర్తిస్తుంది. ట్యాక్స్ పే చేసేవారు తాము చెల్లించే మొత్తంలో 50 శాతంపై ట్యాక్స్ తగ్గింపు లభిస్తుంది. అయితే దీనికోసం పొలిటికల్ పార్టీలు లేదా ఎన్జీవోలు అందించే సర్టిఫికేట్ సబ్మిట్ చేసి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.
లీవ్ ట్రావెల్ అలవెన్స్ : దేశంలో చేసే ప్రయాణాలకు ఇది వర్తిస్తుంది. సెలవు సమయాల్లో ఉద్యోగులు చేసే ప్రయాణాలపై ఈ అలవెన్స్ లభిస్తుంది. ఉద్యోగ కంపెనీలు లేదా యజమానుల నుంచి ఉద్యోగులు ఎల్‌టీఏ(LTA-Leave Travel Allowance) పొందవచ్చు. నాలుగేళ్లలో ఇది రెండుసార్లు మాత్రమే వర్తిస్తుంది. జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి జర్నీ చేయవచ్చు.
భవిష్యత్ అవసరాలు తీర్చేలా పన్ను ఆదా.. వీటిల్లో ఇన్వెస్ట్ చేస్తే!