రెస్టారెంట్‌కు వెళ్లకుండా ఒక్క క్లిక్‌తో కావాల్సిన ఆహారాన్ని ఇంటికే డెలివరీ చేస్తుంటాయి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లు. వీటిలో స్విగీ ప్రధానమైంది. అత్యధికమంది యువత కూడా ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం దేశమంతా లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ, హోటళ్లు మూతపడటం వల్ల స్విగీ ఆర్డర్లను తీసుకోవడం మానేసింది. ఇప్పుడు మళ్లీ ఆర్డర్లను ప్రారంభించింది. అయితే, ఈ ఆర్డర్లు ఫుడ్ కోసం కాదు. నిత్యావసర సరకుల కోసం.
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. నిత్యావసర సరకులకు కూడా కేవలం ఇంటికి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని ఆదేశించింది. దీంతో బయటకు వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకోలేని వారి పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి వారి కోసం ఫుడ్ యాప్ స్విగీ కొత్తగా నిత్యావసర సరకులు ఇంటికే డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 125 పట్టణాల్లో ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులకు సమీపంలో ఉన్న దుకాణాల నుంచి వారికి కావాల్సిన సరకులను స్విగీ ఇంటికే డెలవరీ చేయనుంది. ఇందుకు యాప్‌లోని 'గ్రాసరీ' సెక్షన్‌ను జోడించింది. దాన్ని క్లిక్ చేసి, మనకు నచ్చిన స్టోర్‌ను ఎంపిక చేసుకుని కావాల్సిన సరకులను‘నో కాంటాక్ట్’ డెలివరీ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.
ఒప్పందం..
ఇందులో భాగంగా స్విగీ పలు బ్రాండ్‌లతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. హెచ్‌యూఎల్, పీ & జీ, గోద్రెజ్, దాబర్, విశాల్ మార్ట్, అదానీ విల్మర్స్, సిప్లాలతో పాటు ఆయా నగరాల్లో అందుబాటులో ఉన్న స్టోర్ల నుంచి సరకులను ఇంటికి చేరవేస్తుంది.
"నిత్యావసరాలను కూడా స్విగీలో చేర్చాలని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మా వినియోగదారులకు అధిక ప్రయోజనాలు కల్పించాలని భావించాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీన్ని మేము కొనసాగిస్తాం. లాక్‌డౌన్ నేపథ్యంలో పౌరులకు కనీస మద్దతునివ్వాలన్నదే మా ఉద్దేశం" -సుందర్ వివేక్, స్విగీ సీఓఓ
ఇదీ చూడండి:ఆర్థిక ఆరోగ్యానికీ వైరస్.. సమష్టి పోరుతోనే విజయం