అంబానీ సంస్థ ఆర్‌కామ్‌కు ఇచ్చిన 925 మిలియన్ డాలర్ల రుణాన్ని రికవరీ చేసుకునే యత్నాల్లో భాగంగా ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ చైనా.. ఆయన్ను బ్రిటన్‌లో కోర్టుకు లాగాయి. ఈ ఏడాది మే 22న..ఈ మూడు బ్యాంక్‌లకు 21 రోజుల్లోగా 717 మిలియన్ డాలర్లతో పాటు ఇతర ఖర్చులను చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. జూన్ 12తో గడువు ముగిసినప్పటికీ.. ఆయన ఎటువంటి చెల్లింపులు చేయలేదు. దాంతో ఆ బ్యాంకులు ఆయన ఆస్తులను బహిర్గతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టును అభ్యర్థించడం వల్ల దానికి అనుగుణంగా ఆదేశాలు జారీ అయ్యాయి. దానిలో భాగంగా ఆయన సెప్టెంబర్ 25న విచారణను ఎదుర్కొన్నారు.
అప్పులున్నా...
ఈ క్రమంలో న్యాయవాది అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. తన తల్లికి రూ.500 కోట్లు, కుమారుడు అన్‌మోల్‌కు రూ.310 కోట్లు రుణపడి ఉన్నట్లు చెప్పారు. అలాగే తాను రిలయన్స్ ఇన్నోవెంచర్స్ కోసం రూ.5 బిలియన్ల రుణం తీసుకున్నానని, ఆ కంపెనీలో ఉన్న 12 మిలియన్ల షేర్లు ఇప్పుడు దేనికి పనికిరావని వెల్లడించారు. కుటుంబ ట్రస్ట్‌తో సహా, ప్రపంచ వ్యాప్తంగా ఏ ట్రస్ట్ వల్ల తాను ప్రయోజనం పొందడం లేదని వివరించారు.
"మీరు నిజాయితీగా ఆధారాలు వెల్లడించడం లేదు" అంటూ బ్యాంక్‌ల తరఫు న్యాయవాది క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. దీంతో తన వద్ద 1,11,000 డాలర్ల విలువైన కళాకృతి మాత్రమే ఉందని చెప్పడం సదరు న్యాయవాదిని ఆశ్చర్యపర్చింది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరానికి తాను ఎలాంటి ప్రొఫెషనల్ ఫీజు పొందలేదని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి కారణంగా ఈ ఏడాది ఆశించడం లేదని కూడా అనిల్ చెప్పారు.
మిగిలింది కారు మాత్రమే..
అనిల్ సొంత హెలికాప్టర్, కారు, ఇతర ఆస్తుల గురించి ప్రశ్నించగా.."నా ఖర్చులు చాలా తక్కువ. వాటన్నింటిని నా భార్య, కుటుంబం భరిస్తోంది. నాకు ఇతర ఆదాయాలు కూడా లేవు. ప్రస్తుతం ఒక కారు మాత్రం వాడుతున్నాను. నా వద్ద ఎప్పుడూ రోల్స్‌రాయిస్ కారు లేదు. అవన్నీ మీడియా ఊహాజనిత కథనాలు. అంతేకాకుండా నేను ఆభరణాలు అమ్మి చట్టబద్ధమైన ఖర్చులకు వెచ్చిస్తున్నాను. ముందుముందు మరిన్ని ఖర్చులు ఎదురైతే, ఇతర ఆస్తులకు సంబంధించి కోర్టు ఆమోదానికి లోబడి ఉంటాను. నేను హెలికాప్టర్‌ను వ్యక్తిగతంగా ఉపయోగించకపోతే, దానికి నేను ఏమీ చెల్లించను. లాక్‌డౌన్ వల్ల దాన్ని వాడలేదు. అందువల్లే నా వద్ద ఎటువంటి బిల్లులు లేవు" అని అనిల్ స్పష్టం చేశారు.
అలాగే లండన్, కాలిఫోర్నియా, బీజింగ్‌లో షాపింగ్ చేసినట్లు ఉన్న క్రెడిట్ కార్డు బిల్లుల గురించి ఆరాతీయగా.. అదంతా తన తల్లి కోసం చేసిన షాపింగ్ అని బదులిచ్చారు. ఎనిమిది నెలల కాలంలో వచ్చిన రూ.60.6లక్షల ఎలక్ట్రికల్ బిల్లుకు అధిక టారిఫ్ కారణమని వెల్లడించారు.
ఈ విచారణ అనంతరం అనిల్ ప్రతినిధి, చైనా బ్యాంకులు ప్రకటనలు విడుదల చేశాయి. "అనిల్ సాధారణ జీవితాన్ని గడిపే, అతి సాధారణమైన అభిరుచులు కలిగిన వ్యక్తి" అని అనిల్ ప్రతినిధి వెల్లడించారు.
"మా హక్కులను పరిరక్షించుకోవడానికి, రుణాలను రాబట్టుకోవడానికి ఈ క్రాస్ ఎగ్జామినేషన్ నుంచి పొందిన సమాచారాన్ని ఉపయోగిస్తాం" అని బ్యాంకులు ప్రకటన చేశాయి.
ఇవీ చూడండి: