దేశంలో వైరస్ విజృంభణ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కరోనా కారణంగా దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ.. తన మూడు శాఖలను తాత్కాలికంగా మూసివేసింది. మహారాష్ట్రలో ఇటీవల నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో 8 మంది బ్యాంక్ సిబ్బందికి పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ముంబయిలోని రెండు బ్రాంచ్‌లు సహా.. ఠానే సమీపంలోని ఓ శాఖను మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ.
గతవారం ఠానేలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రధాన శాఖలో పనిచేస్తోన్న 25 మందిలో ఏడుగురు సిబ్బందికి వైరస్ సోకగా బ్యాంక్‌ను మూసివేశారు.
నిత్యం పర్యవేక్షణలో..
తమ సంస్థ ఉద్యోగుల్లో వైరస్ బాధితులు ఎక్కువవుతున్నారని పేర్కొంది ఎస్బీఐ. అయితే వారు కోలుకుంటున్నారని తెలిపింది. ఇందుకోసం ఎస్బీఐ జనరల్ మేనేజర్ అధ్వర్యంలోని ఓ బృందం.. దేశంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని స్పష్టం చేసింది. ప్రొటోకాల్‌ను తప్పనిసరిగా పాటిస్తున్నట్లు చెప్పింది.
కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు ముగ్గురు ఎస్బీఐ ఉద్యోగులు మరణించారు. విచారం వ్యక్తం చేసిన ఎస్బీఐ.. వారికి బ్యాంకు తరఫున పరిహారం, కొవిడ్ పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేసింది.
11 మంది బ్యాంకు ఉద్యోగులు మృతి..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11 మంది బ్యాంకు ఉద్యోగులు కరోనా సోకి మరణించారు. వీరిలో ఎస్బీఐలో ముగ్గురు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఇద్దరు కాగా.. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడీబీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: కరోనా వేళ బంగారంపై పెట్టుబడి మంచిదేనా?