కొవిడ్-19కి సంబంధించిన ఆరోగ్య బీమా పాలసీలను అందించేందుకు తాము చేతులు కలిపినట్లు ఐసీఐసీఐ లాంబార్డ్, గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, ఫ్లిప్‌కార్ట్ ప్రకటించాయి.
కొవిడ్-19 ఆరోగ్య బీమా పాలసీల్లో... ఈజీ క్లయిమ్తో పాటు ఆసుపత్రి ఖర్చులు, గది లేదా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) అద్దె, అంబులెన్స్ సౌకర్యం, టెలీకన్సల్టేషన్ సౌలభ్యం ఉంటాయి. డిజిటల్ క్లెయిమ్ ప్రాసెస్ సౌలభ్యం కూడా ఉంటుంది. అంతే కాకుండా పాలసీని కొనుగోలు చేసే సమయంలో వైద్య పరీక్షల అవసరం ఉండదు.
కొవిడ్-19 ప్రొటెక్షన్ కవర్
ఐసీఐసీఐ లాంబార్డ్ రూపొందించిన 'కొవిడ్-19 ప్రొటెక్షన్ కవర్' వార్షిక ప్రీమియం రూ.159.
ఈ బీమా పాలసీ తీసుకున్న వినియోగదారునికి... కరోనా వ్యాధి నిర్ధరణ అయిన తక్షణం రూ.25 వేలు ఆర్థిక సాయం అందిస్తారు. అంతే కాకుండా వారికి అంబులెన్స్ సహాయంతో పాటు వైద్య ఖర్చులు, వర్చువల్, టెలీకన్సల్టేషన్ ప్రయోజనాలు చేకూరుస్తారు.
ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులు తమ పాలసీని క్లెయిమ్ చేసుకునే సమయంలో.... క్లెయిమ్ డాక్యుమెంట్ల హార్డ్ కాపీలకు బదులు డిజిటల్ కాపీలను సమర్పించవచ్చు.
ది డిజిట్ ఇల్నెస్ గ్రూప్ ఇన్సూరెన్స్
గో డిజిట్ అందించే 'ది డిజిట్ ఇల్నెస్ గ్రూప్ ఇన్సూరెన్స్' వార్షిక ప్రీమియం రూ.511. ఈ పాలసీ ద్వారా వినియోగదారులకు రూ.1 లక్ష వరకు వైద్య ఖర్చులు అందిస్తారు.
ఈ పాలసీలో... వినియోగదారులు చికిత్స పొందే ఆసుపత్రి గది లేదా ఐసీయూ అద్దెకు పరిమితి లేదు. కరోనా నిర్ధరణకు 30 రోజుల ముందు, నిర్ధరణ తరువాత 60 రోజుల పాటు ఆసుపత్రి ఖర్చులన్నీ చెల్లిస్తారు.
ఐసీఐసీఐ లాంబార్డ్, గో డిజిట్ అందించే ఈ రెండు ఆరోగ్య బీమా పాలసీలు ఫ్లిప్‌కార్ట్ (వేదిక) ఫ్లాట్‌ఫాంలో లభిస్తాయి.
ఇదీ చూడండి: ఆహారం, కిరాణా సామగ్రి ద్వారా కరోనా వ్యాపిస్తుందా?