పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉండే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(సీఈఎల్)ను నందల్ ఫైనాన్స్‌కు రూ. 210 కోట్లకు అమ్మనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
గతేడాది ఫిబ్రవరి 3న సంస్థను లీజ్‌కు ఇచ్చేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. నందల్ ఫైనాన్స్ లీజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జేపీఎం ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే రెండు కంపెనీలు మాత్రమే ఈ ఏడాది అక్టోబర్ 12 నాటికి ఫైనాన్షియల్ బిడ్‌లను దాఖలు చేశాయి. ఇందులో జేపీఎం ఇండస్ట్రీస్ రూ. 190కోట్లకు బిడ్ వేయగా... గాజియాబాద్‌కు చెందిన నందల్ ఫైనాన్స్ మాత్రం రూ. 210 కోట్లకు దాఖలు చేసింది. దీంతో ఆల్టర్నేటివ్ మెకానిజం ప్రకారం ఎక్కువ బిడ్ చేసిన వారికి 100 శాతం ఈక్విటీని కట్టబెట్టుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ డీల్ ఈ ఆర్థిక సంవత్సరం చివరికి పూర్తి అవుతుందని పేర్కొన్నారు.
ఈ సంస్థను 1974లో స్థాపించారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. సోలార్ ఫోటోవోల్టాయిక్ రంగంలో అగ్రగామిగా ఉంది. అంతేగాకుండా సొంత పరిశోధనలతో వివిధ సాంకేతికతలను అభివృద్ధి చేసింది. ముఖ్యంగా రైళ్లను సురక్షితంగా నడిపేందుకు అవసరమైన సిగ్నలింగ్ సిస్టమ్‌లలో ఉపయోగించే యాక్సిల్ కౌంటర్ సిస్టమ్‌లను అభివృద్ధి చేసింది సీఈఎల్.
ఇదీ చూడండి: 'బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదనేది లేదు'