ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్.. యూఎస్‌కు యాజమాన్య హక్కులను విక్రయించేందుకు చైనా ససేమిరా అంటోంది. అమ్మడం కన్నా ఆ దేశంలో టిక్‌టాక్‌ను పూర్తిగా మూసేయడమే మంచిదని మాతృ సంస్థ బైట్ డ్యాన్స్ భావిస్తున్నట్లు సమాచారం. అమెరికాలో టిక్‌టాక్‌ను కొనసాగించాలా? మూసేయాలా? అన్నదానిపై బైట్ డ్యాన్స్‌కు ఇచ్చిన గడువు పొడిగించేది లేదని అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ నెల 15తో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో బైట్ డ్యాన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
అదే జరిగితే..
మరోవైపు అమెరికా విధించిన గడువుకు తలొగ్గి యూఎస్ కార్యకలాపాలను ఆదేశానికి విక్రయిస్తే.. అగ్రరాజ్యానికి భయపడినట్లవుతుందని చైనా భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చైనాకు ఇది గొడ్డలిపెట్టుగా మారుతుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. అందువల్ల అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలు కొనసాగించడం కంటే పూర్తిగా మూసివేయడమే మంచిదని బైట్ డ్యాన్స్‌కు బీజింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ అంశంపై చైనా తమకు ఎలాంటి సలహా ఇవ్వలేదని బైట్ డ్యాన్స్ ప్రకటించింది.
పోటా పోటీ!
టిక్‌టాక్ అమెరికా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ చర్చలు జరిపాయి. అంతేకాకుండా సామాజిక మాధ్యమ దిగ్గజాల్లో ఒకటైన ట్విట్టర్ కూడా టిక్‌టాక్ కొనుగోలుకు ఆసక్తి చూపుతోంది. ఇక ఇప్పటికే ఈ యాప్‌పై నిషేధం ఉన్న భారత్‌లో దీన్ని సొంతం చేసుకునేందుకు రిలయన్స్ కూడా టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డాన్స్‌తో చర్చలు కొనసాగిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇదీ చదవండి: చైనా ఒప్పుకుంటేనే టిక్‌టాక్ విక్రయం?