ఆన్లైన్లో ఆర్డర్ చేసిన బిర్యానీ తిన్న మహిళ.. ఆ తర్వాత అస్వస్థతకు గురై, మృతి చెందిన ఘటన కేరళలో జరిగింది. ఇందులో ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కేరళ ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
కాసరగోడ్‌కు చెందిన అంజు శ్రీ పార్వతి(20) డిసెంబర్ 31న దగ్గర్లోని హోటల్నుంచి బిర్యానీ ఆర్డర్ చేసుకుంది. అది తిన్న తర్వాత ఆమె అస్వస్థతకు గురైంది. మొదట ఆమెకు దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించగా.. తర్వాత కర్ణాటకకు తరలించారు. చికిత్స పొందుతూ ఆ యువతి శనివారం ఉదయం మృతి చెందింది. 'మృతురాలు తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. ఫొరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం' అని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేరళ ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. 'ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌ను ఆదేశించాం' అని మంత్రి వీణా జార్జ్ మీడియాకు వెల్లడించారు.
కొద్దిరోజుల క్రితం కొళికోడ్‌లో కూడా ఈ తరహా ఘటనే జరిగింది. కొట్టాయం మెడికల్ కాలేజ్‌కు చెందిన నర్స్ దగ్గర్లోని హోటల్లో ఆహారం తిన్న తర్వాత మృతి చెందింది. ఆమె మృతికి ఫుడ్ పాయిజనే కారణమని అనుమానాలున్నాయి. ఈ వరుస ఘటనలను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ఇవీ చదవండి:
అగ్నివీర్‌గా ఆటోడ్రైవర్ కూతురు.. రాష్ట్రం తరఫున తొలి యువతిగా గుర్తింపు!
భారత్ జోడో యాత్రలో అచ్చం రాహుల్‌లానే మరో కార్యకర్త సెల్ఫీల కోసం ఎగబడ్డ ప్రజలు