up polls 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం సంతరించుకోవడం అటుంచి కంచుకోటగా భావించే రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోని అయిదు అసెంబ్లీ సెగ్మెంట్లను అయినా ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించుకోగలదా? ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కొన్నేళ్లుగా ఈ రాష్ట్రంపై దృష్టి కేంద్రీకరించి పనిచేస్తున్నప్పటికీ తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ పరిధిలోనైనా మెరుగైన ఫలితాలు సాధించగలరా అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో అమేఠీలో అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ కూడా భాజపా అమలు చేస్తూ పట్టు బిగిస్తోంది. 2024లోక్‌సభ ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీ చేయదలిస్తే...ఆమె రాయ్‌బరేలీకి బదులు మరో సురక్షిత స్థానాన్ని ఎంచుకోక తప్పదని క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్‌కు వెళ్లినట్లుగానే సోనియాగాంధీ మరో రాష్ట్రం నుంచి పోటీ చేయాల్సి రావచ్చు.
ఇందిరాగాంధీ, సంజయ్‌గాంధీల హయాం నుంచి కాంగ్రెస్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న రెండు కంచుకోటలు..రాయ్‌బరేలీ, అమేఠీ లోక్‌సభ నియోజకవర్గాలు. ఈ రెండు సెగ్మెంట్ల పరిధిలో 10 శాసనసభ నియోజకవర్గాలుంటే..2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో....రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగలిగారు. అవి కూడా రాయ్‌బరేలీ పరిధిలోవే. రాయ్‌బరేలీ సదర్ నుంచి అదితి సింగ్, హర్‌చంద్‌పుర్ నుంచి రాకేశ్ సింగ్ విజయం సాధించారు. అప్పటికి రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి సోనియా గాంధీ, అమేఠీ లోక్‌సభ స్థానానికి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో... అమేఠీలో స్మృతీఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మిగిలిన లోక్‌సభ స్థానం రాయ్‌బరేలీ ఒక్కటే. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ లోక్‌సభ స్థానం పరిధిలోకి వచ్చే అయిదు శాసనసభ సీట్లనూ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో భాజపా ఉంది. 2017లో రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రత్యేక దృష్టి సారించింది. ఉపముఖ్యమంత్రి దినేశ్ శర్మను రాయ్‌బరేలీ ఇన్‌ఛార్జిగా నియమించింది. కేంద్ర మంత్రి స్మృతీఇరానీ కూడా అమేఠీ పర్యటనకు వచ్చిన ప్రతిసారీ రాయ్‌బరేలీకీ వచ్చి వెళుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ దినేశ్‌సింగ్‌ను 2018లో పార్టీలో చేర్చుకొన్న భాజపా 2019 ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సోనియాపైనే పోటీకి దించింది. కాంగ్రెస్ తరఫున 2017 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అదితి సింగ్, రాకేశ్ సింగ్ ఇప్పుడు భాజపా అభ్యర్థులుగా అవే నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.
పార్టీ కార్యాలయాలు వెలవెల
నాయకులతో పాటు సొంత ఎమ్మెల్యేలూ ఇతర పార్టీల్లోకి ఫిరాయించిన పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు బోసిపోతున్నాయి. పార్టీకి పెద్ద దిక్కుగాఉండాల్సిన నేతలూ ముఖం చాటేస్తున్నారు. యూపీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాజ్‌బబ్బర్, రాజ్యసభ మాజీ ఎంపీ ప్రమోద్ తివారీ, సీనియర్ దళిత నేత పి.ఎల్.పునియా తదితరులు కాంగ్రెస్ ప్రచార సభల్లో కనిపించడంలేదు. టికెట్లు పొందినవారు కూడా ఇతర పార్టీలోకి వెళ్లిపోతున్నారు. గోండాలో టికెట్ కేటాయించిన సవితాపాండే భాజపాలోకి, బరేలీలో.. సుప్రియ అరోన్ సమాజ్‌వాదీలోకి, రాంపుర్‌లో.. హైదర్‌అలీ ఖాన్ అప్నాదళ్‌లోకి, సహరాన్‌పుర్‌లో.. మసూద్ అక్తర్ సమాజ్‌వాదీలోకి జారుకున్నారు. ప్రియాంకా గాంధీ యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతోంది. పార్టీ శ్రేణులను కొంత వరకు కూడ గట్టినా వారికి ధైర్యాన్ని మాత్రం కల్పించలేకపోతున్నారు. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోనైనా కుటుంబ పట్టును కాపాడుకోవడం కష్టమేనని సొంత పార్టీ కార్యకర్తలే వ్యాఖ్యానిస్తున్నారు.
- 2017 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తులో భాగంగా 107 స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ గెలుపొందింది ఏడు చోట్లే.
- అమేఠీ లోక్‌సభ స్థానం పరిధి 5 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ ఓడిపోయింది. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం పరిధిలోని 5 శాసనసభ స్థానాల్లో రెండు చోట్ల మాత్రమే విజయం సాధించింది.
- గెలిచిన ఏడుగురు ఎమ్మెల్యేల్లోనూ ప్రస్తుతం కాంగ్రెస్‌తో ఉంది ముగ్గురే. మిగిలిన నలుగురు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.
- 2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేఠీ నుంచి పోటీ చేసిన రాహుల్ ఓడిపోయారు. భాజపా నేత స్మృతీ ఇరానీ 55వేల ఓట్లతో గెలుపొందారు.
- గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ మొత్తం మీద కాంగ్రెస్‌కు దక్కింది రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం ఒక్కటే. సోనియా గాంధీ 1.5లక్షల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఐదు ఎన్నికలో ఆమెకు లభించిన అతి తక్కువ మెజార్టీ ఇదే.
- 2004లో 2.4లక్షల ఓట్ల ఆధిక్యం, 2006 ఉప ఎన్నికల్లో 4.1లక్షల ఓట్లు, 2009లో 3.7లక్షల ఓట్లు, 2014లో 3.5 లక్షల ఓట్ల ఆధిక్యంతో సోనియా గెలుపొందారు.
ఇదీ చూడండి: పీఎం కేర్స్‌కు భారీగా విరాళాలు.. మూడు రెట్లు పెరిగిన నిధులు