Under Construction Railway Bridge Collapse : ఈశాన్య రాష్ట్రం మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన కుప్పకూలి 23 మంది కూలీలు మరణించారు. ఐజ్వాల్ జిల్లాలో సైరాంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద స్థలిలో 35 నుంచి 40 మంది పని చేస్తున్నారని.. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 23 మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐజ్వాల్ నుంచి 21 కిలో మీటర్ల దూరంలో ఉన్న సైరాంగ్ ప్రాంతంలో రైల్వే వంతెన నిర్మాణం జరుగుతోంది. ఎప్పటిలాగే.. బుధవారం కూడా నిర్మాణ పనులకు కూలీలు హాజరయ్యారు. ఉదయం పది గంటలకు ఒక్కసారిగా వంతెన కూలిపోయంది. దీంతో 23 మంది అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
Mizoram Bridge Accident Today : ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన చేరుకున్నారు. మరణించిన వారి మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు.
మరోవైపు.. మృతులంతా బంగాల్లోని మాల్దా జిల్లాకు చెందినవారేనని ఆ జిల్లా మేజిస్ట్రేట్ బైభవ్ చౌదరీ తెలిపారు. మృతుల కుటుంబాలను అన్నివిదాలా ఆదుకుంటామని అన్నారు.
సీఎం విచారం..
Mizoram Bridge Collapse : ఈ ఘటనపై మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగా విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి పట్ల సంతాపం తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన కూలీలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనా సమయంలో సహాయక చర్యలు చేపట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధాని సంతాపం.. రూ.2లక్షల ఎక్స్గ్రేషియా..
Mizoram Incident : మిజోరం రైలు వంతెన ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు రూ.2లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. గాయపడిన వారికి రూ.50,000 ఇవ్వనున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలుపుతున్నట్లు మోదీ ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
విచారణకు కమిటీ..
మరోవైపు.. మిజోరంలో నిర్మాణంలో ఉన్న రైలు వంతెన కూలిన ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు పరిహారం ప్రకటించారు. అలాగే క్షతగాత్రులకు రూ.50 వేలు అందిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశామని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.