రాజస్థాన్ భరత్‌పుర్‌లో దారుణం జరిగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ ఒకే కుటుంబంలోని ముగ్గురు సోదరుల ప్రాణాలను బలితీసుకుంది. పోలీసులు.. నిందితుడిని లఖన్గా గుర్తించారు. ఆదివారం వేకువజామున జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సిక్రోరాకు చెందిన సమందర్.. పొరుగింటి వ్యక్తి లఖన్‌తో నవంబరు 24న గొడవ పడ్డాడు. ఈ క్రమంలో సమందర్ కుటుంబంపై లఖన్ కోపం పెంచుకున్నాడు. తన అనుచరులతో కలిసి సమందర్ కుటుంబంపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ దాడిలో సమందర్ సహా అతడి ఇద్దరు సోదరులు మరణించారు. మరో ముగ్గురు కుటుంబ సభ్యలు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను జైపుర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మృతులను సమందర్, గజేంద్ర, ఈశ్వర్‌గా పోలీసులు గుర్తించారు. బాధిత కుటుంబం నిద్రిస్తున్న సమయంలో నిందితుడు ఈ కాల్పులు జరిపాడని పోలీసులు జరిపారు.
ఎనిమిదేళ్ల చిన్నారిపై..
ఉత్తర్‌ప్రదేశ్ జౌన్‌పుర్‌లో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు గుర్తు తెలియని వ్యక్తి. బాధితురాలు.. గ్రామంలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రి బయటకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న ఆమెను పొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. ఎప్పటికీ బాలిక ఇంటికి రాకపోవడం వల్ల ఆమె తల్లిదండ్రులు వెతికారు. పొలంలో అపస్మారకస్థితిలో బాలిక కనిపించింది. వెంటనే బాధితురాలి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఉరివేసుకున్న విద్యార్థి..
రాజస్థాన్.. కోటాలో దారుణం జరిగింది. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్న సిద్ధార్థ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. కోటాలోని ఓ ప్రముఖ కోచింగ్ సెంటర్లో అతడు శిక్షణ తీసుకుంటున్నాడు. మృతుడు ఉత్తరాఖండ్‌కు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే విద్యార్థిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు సిద్ధార్థ్ తన తండ్రి మదన్‌సింగ్ ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో అతడు ఇంటి యజమానికి సిద్ధార్థ్ తండ్రి ఫోన్ చేశాడు. తన కుమారుడికి ఒకసారి ఫోన్ ఇవ్వాలని కోరాడు. ఈ క్రమంలో ఇంటి యజమాని వెళ్లి.. సిద్ధార్థ్ గది తలుపు కొట్టగా ఎంతకీ తలుపు తీయలేదు. కిటికీ నుంచి చూడగా సిద్ధార్థ్ ఉరివేసుకుని కనిపించాడు.